తప్పిన ప్రమాదం.. సర్పంచ్ చొరవతో అదుపులోకి భారీ మంటలు
కామంచికల్, జూన్ 4: కామంచికల్ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వెంచర్‌లో గురువారం భారీ మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ బొప్పి ప్రభాకర్ రావు వెంటనే స్పందించి, గ్రామపంచాయతీ ట్యాంకర్‌ను ఘటనాస్థలికి పంపించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
సకాలంలో చేపట్టిన చర్యలతో మంటలు మరింత విస్తరించకుండా అరికట్టడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగకుండా తప్పినట్లు స్థానికులు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బొప్పి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, రైతులు పొలాలు, రహదారుల పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ మంటలు పెట్టవద్దని సూచించారు. వేసవి కాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామ ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటరమణి, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. స్థానికులు సర్పంచ్ వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడాన్ని అభినందించారు.




