కాంగ్రెస్ ఉద్యమానికి కేంద్రం తలొగ్గింది
చిగురుమామిడి కాంగ్రెస్ నాయకుల సంబురాలు
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం సంబురాలు నిర్వహించారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థుల పోరాటానికి ఇది విజయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాలు, విద్యార్థుల నిరసనలు, కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల ఫలితమేనని అన్నారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయని, ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరాన్ని ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయలేదని అన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.
మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారి పక్షాన నిలుస్తుందని అన్నారు. యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలు దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చాయని, కేంద్ర ప్రభుత్వం చివరకు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించక తప్పలేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందే సురేష్ మాట్లాడుతూ, విద్యార్థులు, నిరుద్యోగులు, యువత సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు పశ్చిమట్ల అజయ్ కుమార్, మండల నాయకులు పూల లచ్చిరెడ్డి, దోమ నర్సింహారెడ్డి, ఏబీకే చారి, పోతర్ల శివాంజనేయులు, బుర్ర శ్రీనివాస్, దోమ తిరుపతిరెడ్డి, పచ్చిమట్ల జగన్, ఎండి కుతుబుద్దీన్, సిరవేణి సంపత్, జిల్లల రమేష్, పేసరి శ్రీనివాస్, కక్కర్ల సంపత్, పణ్యాల జగన్ రెడ్డి, చొప్పదండి సాయి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఉద్యమానికి కేంద్రం తలొగ్గింది
RELATED ARTICLES




