సర్వే నంబర్ 697 భూమిపై సమగ్ర విచారణ జరపాలి.
ఎమ్మార్పీఎస్ మండల కోఆర్డినేటర్ అడ్డూరి అనిల్ మాదిగ
ఎల్కతుర్తి ప్రజావాణి:-
ఎల్కతుర్తి గ్రామ శివారు ఇందిరానగర్‌లోని సర్వే నంబర్ 697 భూమిపై వెంటనే సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఎమ్మార్పీఎస్ మండల కోఆర్డినేటర్ అడ్డూరి అనిల్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ అంబాల రాజ్‌కుమార్‌తో పాటు గ్రామస్తులు పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదులు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
సర్వే నంబర్ 697లోని భూమి ప్రభుత్వ భూమా పట్టాభూమా అనే విషయాన్ని గ్రామ ప్రజల సమక్షంలో బహిరంగంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం వల్ల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దశలవారీగా భూమిని విక్రయిస్తున్నాడని అధికారులు స్పందించేలోపే మొత్తం భూమి అమ్ముడుపోయే పరిస్థితి నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదే సర్వే నంబర్‌కు సంబంధించి భార్యాభర్తల పేర్లపై 1.15 గుంటలు 0.12 గుంటలు 1.13 గుంటల మేర పట్టాలు నమోదు చేసుకున్నారని ఆరోపించారు. అలాగే వారు ఎస్సీ వర్గానికి చెందిన వారు కాకపోయినా కుల ధ్రువీకరణలో ఎస్సీగా నమోదు చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై కూడా సమగ్ర విచారణ నిర్వహించి నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
భూమి యాజమాన్యం పట్టాల నమోదు కుల ధ్రువీకరణకు సంబంధించిన అన్ని అంశాలపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేనిపక్షంలో వివాదాస్పద భూమిని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలుగా పంపిణీ చేసే ఉద్యమాన్ని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపడతామని హెచ్చరించారు. అధికారులు వెంటనే స్పందించి ఈ వివాదానికి ముగింపు పలకాలని అడ్డూరి అనిల్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షులు గొల్లమందల చరణ్ మాదిగ మండల సీనియర్ నాయకులు బొంకూరి సదనందం మాదిగ సూరారం గ్రామశాఖ అధ్యక్షులు మేకల కొమురయ్య మాదిగ మైస పవన్ మాదిగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




