📄 ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyదోమల నివారణపై అవగాహన సదస్సు నిర్వహణ

దోమల నివారణపై అవగాహన సదస్సు నిర్వహణ

📰 Generate e-Paper Clip

*దోమల నివారణపై అవగాహన సదస్సు నిర్వహణ*
*వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*: *హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు*
షాద్నగర్ ప్రజావాణి జూలై 27:
వర్షాకాలంలో దోమలు, ఈగల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు సూచించారు. ఫరూక్‌నగర్ మండలం చించోడు గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ రాకాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభకు ఎంపీడీవో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జె. శ్రీనివాసులు మాట్లాడుతూ, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం, తేమ పెరగడం వల్ల దోమలు, ఈగలు అధికంగా వృద్ధి చెందుతాయని తెలిపారు. వీటి ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు.
అనాఫిలిస్ దోమల ద్వారా మలేరియా వ్యాపిస్తుందని, జ్వరం, చలి వణుకులు, తలనొప్పి, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. క్యూలెక్స్ దోమల వల్ల ఫైలేరియా వచ్చే అవకాశం ఉండగా, శోషరస గ్రంథుల వాపు, చేతులు లేదా కాళ్లలో వాపు, చర్మం మందంగా మారడం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు.
ఏడిస్ దోమల ద్వారా డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధులు వ్యాపిస్తాయని, అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచన మేరకు చికిత్స పొందాలని సూచించారు.
వర్షాకాలంలో ఈగల ద్వారా ఆహారం, తాగునీరు కలుషితమై విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వడంతో పాటు శుద్ధి చేసిన లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడడం, తాజా వేడి ఆహారం తీసుకోవడం, భోజనం ముందు మరియు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దోమతెరలు వినియోగించడం, రెండు రోజులకుపైగా జ్వరం కొనసాగినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ రాకాల శ్రీనివాస్, డిప్యూటీ సర్పంచ్ కే. రాజేందర్ రెడ్డి, విలేజ్ సెక్రటరీ జయపాల్ రెడ్డి, డీపీఎంఓ వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు ఉమామహేశ్వర నాయక్, సంతోష్ నాయక్, యాదగిరి, రామచంద్రయ్య, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular