📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyషాద్‌నగర్‌లో ఫీజుల బకాయిలపై బీజేవైఎం సమరభేరి

షాద్‌నగర్‌లో ఫీజుల బకాయిలపై బీజేవైఎం సమరభేరి

📰 Generate e-Paper Clip

*షాద్‌నగర్‌లో ఫీజుల బకాయిలపై బీజేవైఎం సమరభేరి*
షాద్‌నగర్ ప్రజావాణి జులై 27 : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర పిలుపు మేరకు షాద్‌నగర్‌లో “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమం నిర్వహించారు. బీజేవైఎం షాద్‌నగర్ అసెంబ్లీ కన్వీనర్ పుట్నాల సాయికుమార్ ఆధ్వర్యంలో బీఏఎం డిగ్రీ కళాశాల, విశ్వభారతి ఇంటర్ కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బుర్ర అభినయ్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉండటంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు ఫీజులు సకాలంలో అందక చదువులో ఆటంకాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కొన్ని కళాశాలలు ఫీజు బకాయిల కారణంగా విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేస్తుండటంతో పాటు పరీక్షలు, ఉన్నత విద్యలో ప్రవేశాల విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సుమారు రూ.15 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉండగా, కేవలం రూ.100 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని ప్రకటించడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేవైఎం నాయకులు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు.
బీజేవైఎం ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని, ఫీజు బకాయిల కారణంగా విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యా సంవత్సరంలో నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం నిధులు విడుదల చేసే శాశ్వత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది ప్రభుత్వ భిక్ష కాదని, విద్యార్థుల హక్కు అని ప్రభుత్వం గుర్తించాలని కోరింది.
ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీజేవైఎం నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు వివేక్, శివలింగం, అభి, శ్రీధర్, నరేష్, మహేష్, రాకేష్, రమేష్, పవన్, అజయ్, చందు తదితరులతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, యువమోర్చా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular