సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి
మున్సిపల్ బడ్జెట్ ను సద్వినియోగం చేసుకొని హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలనీ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ మున్సిపల్ పాలకవర్గం మున్సిపల్ అధికారులకు సూచించారు.బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపాల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, సమక్షంలో 2026-2027 మున్సిపల్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2026-2027 హుస్నాబాద్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ 21కోట్ల88 లక్షల రూపాయల అంచనా రాబడి కాగా 21 కోట్ల 88 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మున్సిపల్ కౌన్సిల్లో ప్రవేశపెట్టగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు చేతులు పైకి ఎత్తి ఆమోదం తెలిపారు.ఈ సందర్బంగా మంత్రివర్యులు మున్సిపల్ పాలకవర్గాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. వివిధ రకాలుగా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని సద్వినియోగం చేసుకొని పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించి హుస్నాబాద్ పట్టణానికి, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు గౌరవం పెరిగేలా మున్సిపల్ పాలకవర్గం మరియు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనులు చేయాలని అన్నారు. పట్టణ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను స్థానిక పార్లమెంటు సభ్యులతో కలిసి తీసుకువస్తామని వాటిని పట్టణ అభివృద్ధికి సరిగా ఉపయోగించి, పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా మరియు భవిష్యత్తు తరాలు స్వచ్ఛమైన వాతావరణంలో జీవించేలా పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రభావవంతంగా నిర్వహించాలని సూచించారు. హుస్నాబాద్ పట్టణానికి చుట్టూ నలభై, యాభై కిలోమీటర్ల దూరంలో ఇతర జిల్లాల కేంద్రాలు ఉన్నాయని విద్యా, వైద్యం, ఆరోగ్యం తదితర అవసరాల కొరకు అక్కడికి వెళ్లకుండా స్థానికంగానే ప్రభుత్వం ఆయా సౌకర్యాలను కల్పిస్తుందని, వాటితో పాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వలన స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని వాటిని పట్టణ ప్రజలు ఉపయోగించుకునేలా చూడాలని అన్నారు. పట్టణ అభివృద్ధికి వచ్చే బడ్జెట్లో మరింత నిధులు నిధులు పెరిగేలా అవకాశం రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ.. నూతనంగా ఎంపికైన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా పట్టణాన్ని మరింత అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రజా ప్రణాళిక కార్యక్రమం ద్వారా హుస్నాబాద్ పట్టణంలో మౌలిక వసతుల కల్పన, పచ్చదనం, పారిశుభ్రత కార్యక్రమాలను చేపడతామని, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మార్గదర్శకత్వంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



