📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్కరువుతో అల్లాడుతున్న జనగామ జిల్లా ప్రభుత్వం ఏం చేస్తోంది? సిపిఎం

కరువుతో అల్లాడుతున్న జనగామ జిల్లా ప్రభుత్వం ఏం చేస్తోంది? సిపిఎం

📰 Generate e-Paper Clip

 

సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో కరువుపై గర్జన

జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌ పట్టణ ప్రజలకు 200 రోజుల ఉపాధి పని కల్పించాలి.

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 24 (ప్రజావాణి): ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు అప్పులు చేసి పంటలు సాగుచేసినా దిగుబడులు లేక తీవ్ర నష్టం వాటిల్లిందని, సకాలంలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డిలు డిమాండ్ చేశారు.

మంగళవారం జనగామ పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు సింగారపు రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.

పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందించి రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలన్నారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ పట్టణాల్లో కూడా వేలాదిమంది కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సందర్భంలో జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, రైతు కూలీలకు, పేదలకు 200 రోజుల ఉపాధి పని కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంతో పాటు గతంలో ఇచ్చిన వ్యవసాయ రుణాలను మాఫీ చేసి, కొత్త రుణాలు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.

బియ్యం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి దోచుకుంటున్నారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బియ్యం ధరల పెంపును అరికట్టి ప్రజలకు తక్కువ ధరకు బియ్యం అందించాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రేషన్ షాపు ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.

జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం చేస్తామన్నారు. గత జూలై నుంచే దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు నింపి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, ముందస్తు ప్రణాళికలు లేకపోవడం ప్రభుత్వ తప్పిదమేనన్నారు. ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించి జిల్లా ప్రజలందరినీ ఆదుకోకపోతే జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, సుంచు విజేందర్, బోడ నరేందర్, పోత్కనూరి ఉపేందర్, బిట్ల గణేష్, బెల్లంకొండ వెంకటేష్, ఆకుల శ్రీనివాస్, చిట్యాల సోమన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.