మఠంపల్లిలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు
మఠంపల్లి (ప్రజావాణి): మఠంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఈ నెల 29న ఆదివారం ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారి విగ్రహంతో పాటు ధ్వజస్తంభం, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, మాలికాపురత్తమ్మ తదితర విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు రక్షాబంధనం, దీక్షారాధన, పంచగవ్య ప్రాశనం, యాగశాల ప్రవేశం, ద్వారపూజలు, స్తంభపూజలు, అఖండ స్థాపన, అంకురార్పణ, దేవతా ఆహ్వానం వంటి కార్యక్రమాలతో మహోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 7.30 గంటలకు నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాదాల పంపిణీ నిర్వహిస్తారు.
26వ తేదీ గురువారం విఘ్నేశ్వర పూజ, వాస్తుపూజ, వాస్తుహోమం నిర్వహించనున్నారు. సాయంత్రం 7.30 గంటలకు నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాదాల కార్యక్రమాలు ఉంటాయి. 27, 28 తేదీల్లో వేదాధివాసం, పంచామృతాధివాసం, పంచగవ్యాధివాసం, మూలమంత్ర హోమాలు నిర్వహించనున్నారు.
29వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు పుణ్యాహవచనం, రక్షాహోమం, కళాన్యాసం, దృష్టికుంభం, నేత్రోన్మీలనం, కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించి, ఉదయం 9 గంటల 18 నిమిషాలకు అశ్విని నక్షత్రం, ధనుర్లగ్న పుష్కరాంశ ముహూర్తంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి విగ్రహంతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది.
మఠంపల్లి గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ కంభంపాటి శాండిల్ శర్మ ఆధ్వర్యంలో, కంచి కామకోటి పీఠ ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ వేద వేదమూర్తులు గట్టి వెంకట సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గణపాఠి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి విచ్చేసే అయ్యప్ప స్వాములు, శివస్వాములు, ఆంజనేయ స్వాములతో పాటు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
ఈ ప్రతిష్ఠ మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరింది.


