అంబేద్కర్ ఆశయాల సాధనకు ఐక్యంగా పోరాడాలి
దళితుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణకు ఐక్యతే ప్రధాన ఆయుధం
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 22:
దళితుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణతో పాటు సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో హక్కుల సాధనకు కృషి చేయాలని సూచించారు.
పెద్దపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నిర్వహించిన 50 ఏళ్ల స్వర్ణోత్సవ మహాసభకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని బస్టాండ్ ఎదుట ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు, సభ్యులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఐదు దశాబ్దాలుగా సామాజిక చైతన్యం కోసం కృషి చేస్తున్న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్వర్ణోత్సవ మహాసభకు విచ్చేసిన పెద్దలు, మేధావులు, యువతతో పాటు దళిత సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.
ప్రస్తుత సమాజంలో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తూ నియంతృత్వ ధోరణితో పాలన సాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల గొంతుకను నొక్కేస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అధికార స్వార్థం కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ బ్రిటిష్ వారి తరహాలో విభజించు పాలించు విధానాన్ని అనుసరించడం ఆందోళనకరమన్నారు.
కులాల మధ్య చిచ్చుపెడుతూ దళితులను అణగదొక్కే ప్రయత్నాలను సహించేది లేదని స్పష్టం చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, వారిని అవమానించేలా వ్యవహరించే రాజకీయ ధోరణులను అంబేద్కర్ వాదులంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, కుట్రలను ప్రజాస్వామ్యవాదులంతా సంఘటితంగా ఎదుర్కోవాలని అన్నారు.
దళిత సమాజంపై జరుగుతున్న అన్యాయాలను, హక్కుల హననాన్ని అడ్డుకోవాలంటే ఐక్యతే ఏకైక మార్గమని ఎంపీ పేర్కొన్నారు. చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి దళితులంతా ఒకే తాటిపైకి రావాలని, ఐక్యంగా ఉంటేనే హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలమని అన్నారు. విద్య, నిధుల కేటాయింపుల్లో దళితులకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నిరుపేద దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కాకా వెంకటస్వామి అంబేద్కర్ విద్యాసంస్థలను స్థాపించారని గుర్తుచేశారు. ఆ విద్యాసంస్థల్లో చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవలందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వంటి ప్రముఖులు కూడా విద్య ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు.
దళిత సమాజ సమగ్ర అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని, వారి హక్కులు, సమస్యలు, సంక్షేమ అంశాల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం యువత సామాజిక చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

