విద్యార్థుల విజయమే లక్ష్యం.. కల్వల బడికి సంజీవరెడ్డి భరోసా!
పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు.. ఉన్నత ఫలితాల సాధనకు ప్రోత్సాహం
బాసర ఐఐఐటీలో కల్వల విద్యార్థుల సంఖ్య పెరగాలని ఆకాంక్ష
కేసముద్రం నవంబర్ 16,ప్రజావాణి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం అందించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి ముందడుగు వేశారు. చదువుల ఒత్తిడిలో ఉన్న పదో తరగతి విద్యార్థుల్లో ఉత్సాహం నింపేందుకు కల్వల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు చేసి తన ప్రోత్సాహాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన ఆత్మీయంగా మాట్లాడారు. పదో తరగతి విద్యార్థుల జీవితంలో కీలకమైన మైలురాయని, ఈ దశలో కష్టపడి చదివి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. పరీక్షలను భయంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
*బాసర ఐఐఐటీలో కల్వల కీర్తి చాటాలి!*
గతంలో కల్వల పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలను గుర్తుచేస్తూ, ఈసారి కూడా పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సంజీవరెడ్డి ఆకాంక్షించారు. ముఖ్యంగా బాసర ట్రిపుల్ ఐటీలో కల్వల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో సీట్లు సాధించి గ్రామానికి, పాఠశాలకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభకు సరైన ప్రోత్సాహం తోడైతే అద్భుత విజయాలు సాధించడం సాధ్యమేనని వారికి భరోసా కల్పించారు.విద్యార్థులకు స్నాక్స్ అందించడం కేవలం ఒక చిన్న సహాయంగా కాకుండా, పరీక్షల సమయంలో వారిలో ఉత్సాహాన్ని నింపే ఆత్మీయ ప్రోత్సాహంగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయాలను గ్రామ గౌరవంగా భావిస్తూ, వారి చదువులు, భవిష్యత్తుపై ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు శ్రద్ధ చూపడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్, గ్రామ సర్పంచ్ వేల్పుల సుజాత రామచంద్రయ్య, ఉపసర్పంచ్ పెదగాని రవి, గండి శ్రీనివాస్, గంట బాలకృష్ణరెడ్డి, గంట రాంమోహన్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
