ప్రత్యక్ష పరిశీలనతో వృక్షశాస్త్రంపై విద్యార్థులకు అవగాహన
కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటనీ ఫీల్డ్ ట్రిప్
కూసుమంచి (మన ప్రజావాణి) ప్రతినిధి RK
: విద్యార్థుల్లో పుస్తక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థులకు బోటనీ ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ వీరభద్రరావు అధ్యక్షతన, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు కళ్యాణి ఆధ్వర్యంలో ఈ క్షేత్ర పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల సమీపంలోని చెరువులు, వ్యవసాయ పొలాలు, సహజ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి వివిధ రకాల మొక్కలను ప్రత్యక్షంగా పరిశీలింపజేశారు. మొక్కల గుర్తింపు, వాటి లక్షణాలు, ఉపయోగాల గురించి వివరించారు. హెర్బేరియం తయారీ కోసం వివిధ రకాల మొక్కల కొమ్మలు, ఆకులు, పుష్పాలను సేకరించే పద్ధతులను ప్రాక్టికల్‌గా తెలియజేశారు.
ఈ క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులకు వృక్షశాస్త్రంపై ప్రత్యక్ష అవగాహనతో పాటు ప్రయోగాత్మక పరిజ్ఞానం లభించింది. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానాన్ని మరింత పెంపొందిస్తాయని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి.

