📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం

📰 Generate e-Paper Clip

*విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం*

*పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ*

* *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*

జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 320 మంది విద్యార్థులకు ఎంపీ వంశీకృష్ణ స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారి చదువు, సమస్యలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, సోమనపల్లి గ్రామంలో సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇది అందుబాటులోకి వస్తే చెన్నూరు విద్యార్థులకు ప్రపంచస్థాయి సదుపాయాలతో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు అనే కాకా వెంకటస్వామి ఆశయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జైపూర్ జడ్పీ హైస్కూల్ లో 320 మంది విద్యార్థులు చదువుకోవడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగి పాఠశాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఎంపీ ల్యాడ్స్ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు అందజేస్తే పరిశీలించి, సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*పదేళ్లుగా పెండింగ్‌ లో ఉన్న 76 జీవో పునరుద్ధరణ*

*బెల్లంపల్లి అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి 25 లక్షలు…ఎంపీ వంశీకృష్ణ*

గత పదేళ్లుగా పెండింగ్‌ లో ఉన్న జీవో 76ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో పునరుద్ధరించారని, సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న పేదలకు తిరిగి పట్టాలు అందించడం సంతోషంగా ఉందని పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ తెలిపారు. జిల్లాలోని బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మంగళవారం ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ లు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలో 45 లక్షల రూపాయలతో చేపట్టనున్న డివైడర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 33వ వార్డులో సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్న లబ్ధిదారులకు జీవో 76 ద్వారా మంజూరైన ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, ఎమ్మెల్యే వినోద్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని, బెల్లంపల్లి అభివృద్ధి కోసం తన ఎంపీ ల్యాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనులు ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి, మార్కెట్ కమిటీ చైర్‌ పర్సన్ రత్నం సుకుమారి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.