📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబాటిల్‌లో బ్రాండ్‌ ఏది.. లోపల ఉన్నది ఏది

బాటిల్‌లో బ్రాండ్‌ ఏది.. లోపల ఉన్నది ఏది

📰 Generate e-Paper Clip

*బాటిల్‌లో బ్రాండ్‌ ఏది.. లోపల ఉన్నది ఏది?*

ట్యూబోర్గ్‌ బాటిల్‌పై కింగ్‌ఫిషర్‌ స్టిక్కర్‌.. మద్యం విక్రయాలపై అనుమానాలు!

తాగేది బీరేనా.. నాణ్యతకు గ్యారెంటీ ఉందా?

వినియోగదారుల ఆరోగ్య భద్రతకు ఎవరు బాధ్యులు?

శబరి వైన్స్‌ పక్కనున్న బెల్ట్‌షాప్‌పై ఎక్సైజ్‌ శాఖ విచారణకు స్థానికుల డిమాండ్‌.

కేసముద్రం, నవంబర్‌ 9, ప్రజావాణి.

మద్యం బాటిల్‌ చేతిలోకి తీసుకున్న వినియోగదారుడు అందులోని బ్రాండ్‌ను చూసి, నాణ్యతపై నమ్మకంతో కొనుగోలు చేస్తాడు. కానీ అదే బాటిల్‌పై ఒక కంపెనీ పేరు ఉండి.. మరో కంపెనీకి చెందిన స్టిక్కర్‌ కనిపిస్తే పరిస్థితి ఏమిటి? తాను కొనుగోలు చేస్తున్నది అసలైన ఉత్పత్తేనా? దాని నాణ్యతకు భరోసా ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. కేసముద్రంలోని శబరి వైన్స్‌ పక్కనున్న బెల్ట్‌షాప్‌లో విక్రయించినట్లు చెబుతున్న ఓ బీర్‌ బాటిల్‌ ఇప్పుడు ఇలాంటి అనుమానాలనే రేకెత్తిస్తోంది.
*ఒక బాటిల్‌.. రెండు కంపెనీల పేర్లు!*
బాటిల్‌పై ట్యూబోర్గ్‌ పేరు చెక్కి ఉండగా, దానిపై కింగ్‌ఫిషర్‌ ప్రీమియం లాగర్‌ బీర్‌ స్టిక్కర్‌ అంటించి ఉండటం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా కనిపించే ఈ చిన్న వ్యత్యాసం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒక కంపెనీకి చెందిన బాటిల్‌పై మరో కంపెనీ లేబుల్‌ ఎందుకు ఉంది? ఇది ప్యాకేజింగ్‌లో జరిగిన పొరపాటా? లేక సరఫరా, విక్రయాల వ్యవస్థలో ఏదైనా అక్రమం జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది.
*మద్యం బాబుల ప్రాణాలతో చెలగాటమా?*
మద్యం కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడికి తాను చెల్లించిన డబ్బుకు తగిన నాణ్యమైన ఉత్పత్తి లభించాలన్నదే ఆశ. బాటిల్‌పై బ్రాండ్‌ ఒకటి.. లోపల ఉన్న ఉత్పత్తి మరోటి అయితే వినియోగదారుడు ఎలా గుర్తించాలి? నాణ్యతపై సందేహం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.అనుమానాస్పద మద్యం విక్రయాలు జరిగితే ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యవహారాన్ని చిన్న విషయంగా పరిగణించకుండా బాటిల్‌ అసలు వివరాలు, తయారీ సంస్థ, బ్యాచ్‌ నంబర్‌, సరఫరా మార్గాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
*బెల్ట్‌షాపుల్లో తనిఖీలు ఎక్కడ?*
శబరి వైన్స్‌ పక్కనే ఈ ఘటన వెలుగులోకి రావడంతో పరిసర ప్రాంతాల్లోని బెల్ట్‌షాపుల్లోనూ తనిఖీలు చేపట్టాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. అనుమతులు, విక్రయాల నిబంధనలు, మద్యం నిల్వలు, సరఫరా వివరాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. అనుమానాస్పద బాటిళ్లను స్వాధీనం చేసుకుని సంబంధిత కంపెనీ ప్రతినిధుల ద్వారా ధ్రువీకరించడంతోపాటు అవసరమైతే ప్రయోగశాల పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
*అధికారులారా.. అనుమానాలు నివృత్తి చేయండి!*
ఒక బీర్‌ బాటిల్‌పై రెండు బ్రాండ్ల గుర్తులు కనిపించడం వెనుక అసలు కారణం ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. బాటిల్‌ ఎక్కడ తయారైంది? ఎక్కడి నుంచి సరఫరా అయింది? విక్రయ కేంద్రానికి ఎలా చేరింది? లేబుల్‌లో వ్యత్యాసానికి కారణమేంటి? అనే అంశాలపై ఎక్సైజ్‌ అధికారులు విచారణ జరపాలి. తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.మద్యం అమ్మకాల కంటే వినియోగదారుల భద్రత ముఖ్యం. ఆదాయం కంటే ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత వ్యవస్థపై ఉంది. ఒక్క బాటిల్‌పై వచ్చిన అనుమానం.. వందలాది మంది వినియోగదారుల భద్రతపై ప్రశ్నగా మారకముందే అధికారులు స్పందించాలి. నిజానిజాలు నిగ్గుతేల్చి ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు తెరదించాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.