పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి
వ్యర్థాలను తగ్గించడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన రవాణా శాఖ అధికారులు
తిరుపతి, నవంబర్ 07 (మన సమగ్ర ప్రజావాణి):
BRICS కార్యక్రమంలో భాగంగా ఏడవ రోజు శనివారం తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో “REDUCE WASTE – వ్యర్థాలను తగ్గిద్దాం” అనే ఇతివృత్తంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆహార వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, నీటి వృథా, కాగితాల వృథాను తగ్గించడంపై అధికారులు అవగాహన కల్పించారు. అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా వినియోగించడం, పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బ్యాటరీలను నిర్దేశిత కేంద్రాలకు అందించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నివారించడం, నీటిని పొదుపుగా వినియోగించడం వంటి అంశాలను వివరించారు. అలాగే కార్యాలయాల్లో కాగితాల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ విధానాలను ప్రోత్సహించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ ప్రయాణ సమయంలో రోడ్లపై చెత్త వేయకూడదని, ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను రోడ్లపై పడేయరాదని సూచించారు. వాహనాల నిర్వహణ సమయంలో వెలువడే వ్యర్థాల విషయంలో కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
అనంతరం అధికారులు, సిబ్బంది “Reduce, Reuse, Recycle – తగ్గించు, తిరిగి వాడు, పునర్వినియోగించు” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో భాగంగా ఆర్టీవో సిబ్బంది డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ వద్ద శ్రమదానం నిర్వహించి వ్యర్థ మొక్కలను తొలగించారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, అతికా నాజ్, స్వర్ణలత, పరిపాలనా అధికారులు విజయ్ కుమార్, విజయ ప్రశాంతి, కాలుష్య నియంత్రణ మండలి అధికారి దేవరాజులు తదితరులు పాల్గొన్నారు.

