📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్లలో నిబంధనలు గాలికి: టపాసుల కేంద్రాల్లో అక్రమ దందా. అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారా?

పోరుమామిళ్లలో నిబంధనలు గాలికి: టపాసుల కేంద్రాల్లో అక్రమ దందా. అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారా?

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల రూరల్: నవంబర్ 07ప్రజావాణి మండల కేంద్రంలో టపాసుల విక్రయ కేంద్రాలు అక్రమాలకు, ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా వ్యాపారులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. పత్రికల్లో వరుసగా వార్తలు వస్తున్నా, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై, వారిని చూసీచూడనట్లు వదిలేస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బిల్లు లేదు.. నిలదీస్తే బెదిరింపులు!

మండలంలోని ఏ ఒక్క టపాసుల విక్రయ కేంద్రంలోనూ వినియోగదారులకు కనీస బిల్లులు ఇవ్వడం లేదు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి కొనుగోలుకూ బిల్లు తప్పనిసరి. కానీ, ఇక్కడ వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు నిర్ణయించి దోపిడీకి పాల్పడుతున్నారు. ధరల పట్టిక (రేట్ బోర్డులు) ప్రదర్శించకుండా కస్టమర్లను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఎవరైనా ధైర్యం చేసి బిల్లు అడిగితే, “బిల్లు కావాలంటే వేరే చోట కొనుక్కో” అంటూ దురుసుగా సమాధానం ఇస్తూ, బెదిరింపులకు గురిచేస్తుండటం గమనార్హం.

చిన్నారుల ప్రాణాలతో చదరంగం: ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ బహిరంగ ఉల్లంఘన

అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ బాంబుల దుకాణాల్లో 10 నుండి 12 ఏళ్ల వయసున్న చిన్నారులను కూర్చోబెట్టి పనులు చేయిస్తున్నారు. గన్ పౌడర్, టపాసులు, అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు ఉండే చోట చిన్నారులను ఉంచడం ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ (పేలుడు పదార్థాల చట్టం) ప్రకారం తీవ్రమైన నేరం. చట్టప్రకారం 18 ఏళ్ల లోపు ఉన్న బాల కార్మికులను ఇలాంటి ప్రమాదకర దుకాణాల్లో అసలు ఉంచనే కూడదు. కానీ, ఇక్కడ చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.నిబంధనల ప్రకారం టపాసుల దుకాణాల వద్ద అగ్నిమాపక సిలిండర్లు, ఇసుక బకెట్లు, నీటి తొట్టెలు అత్యంత కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. కానీ, పోరుమామిళ్లలోని ఏ ఒక్క షాపులోనూ ఈ భద్రతా ప్రమాణాలు కనిపించడం లేదు. ఒక్క చిన్న నిప్పురవ్వ పడినా సరే, మొత్తం ప్రాంతం బూడిద కుప్పగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి వ్యాపారులు కేవలం లాభాల కోసమే చూస్తున్నారు.

ఫైర్ అధికారులు ఏం చేస్తున్నారు? పటాకుల వసూళ్లపై పొంతన లేని సమాధానాలు!

టపాసుల విక్రయ కేంద్రాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇవ్వడంతోనే ఫైర్ బాధ్యత తీరిపోయిందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దుకాణాలు తెరిచిన తర్వాత అక్కడ కనీస అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన బాధ్యత ఫైర్ అధికారులపై ఉంది. పక్కనే చిన్నారులను ఉంచి వ్యాపారం చేస్తున్నా, ప్రమాదకరంగా దుకాణాలు నిర్వహిస్తున్నా అగ్నిమాపక శాఖ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.మరోవైపు, అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీల పేరుతో వచ్చి కేవలం వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విలేకరులు, మీడియా ప్రతినిధుల పేర్లు చెప్పి ఫైర్ అధికారులు దుకాణాల నుంచి భారీగా పటాకుల మూటలను పట్టుకెళ్లినట్లు షాప్ యాజమాన్యాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. మీడియా వారికి ఇవ్వాలంటూ ఉచితంగా టపాసులు తీసుకెళ్లడం వెనుక అసలు అంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగితే దానికి ఫైర్ అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. మీడియా ప్రతినిధుల పేర్లు చెప్పి ఫైర్ అధికారులు పటాకులు తీసుకెళ్లారనే అంశంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ఫైర్ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి వివరణ కోరగా, తాము ఎటువంటి పటాకులు తీసుకోలేదని వారు బుకాయిస్తున్నారు. అయితే, తాము అబద్ధం చెప్పడం లేదని, ఫైర్ అధికారులే స్వయంగా వచ్చి పటాకుల మూటలను తీసుకెళ్లారని షాప్ యాజమాన్యాలు బహాటంగా చెబుతున్నాయి. అధికారుల మాటలకు, యాజమాన్యం చెబుతున్న దానికి అస్సలు పొంతన లేకపోవడంతో ఈ వ్యవహారం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తప్పును కప్పిపుచ్చుకోవడానికే అధికారులు డ్రామాలు ఆడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల ఉదాసీనత.. మామూళ్ల మత్తులోనేనా?

ఈ అక్రమాలపై పత్రికల్లో వార్తలు ప్రచురితమైనా రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ (కొలతల శాఖ), ఫైర్ (అగ్నిమాపక) శాఖల అధికారులు ఇప్పటివరకు కనీసం ఒక్క ఉమ్మడి తనిఖీ కూడా నిర్వహించకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.ఈ మౌనం వెనుక వ్యాపారుల నుంచి అందుతున్న నెలవారీ మామూళ్లే కారణమనే అనుమానాలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి, దుకాణాల్లో బిల్లులు ఇవ్వడం లేదన్న మాట నిజమేనని, ప్రజలు అంటున్నారు రేట్ల వివరాల బోర్డులు కూడా పెట్టలేదని అంగీకరిస్తూనే.అది సేల్స్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలి, అది మా పరిధిలోకి రాదు”అంటూ చేతులెత్తేయడం గమనార్హం. ఇటు ఫైర్ అధికారులు, అటు రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రజల భద్రతను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ వెంటనే లైసెన్సులు రద్దు చేయండి!“పిల్లల ప్రాణాలతో వ్యాపారం సాగిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం.దీపావళి పండగ పూట వ్యాపారులకు, అధికారులకు లాభాల పండగలా మారింది. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని,నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై అగ్నిమాపక,పోలీస్, రెవెన్యూ శాఖలతో తనిఖీలు చేయించి, తక్షణమే వాటి లైసెన్సులను రద్దు చేయాలి.బాధ్యులైన వ్యాపారులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి” అని మండల ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.