*నీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత.. ఎల్‌నినోపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సర్పంచ్ జక్కుల గజేందర్, ఈఓ బండారి రాజబాబు*
*విజయ సాయి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో వినూత్న అవగాహన కార్యక్రమం.. రైతులు, సర్పంచులు, వ్యవసాయ అధికారుల వేషధారణలో చిన్నారుల ప్రదర్శన.. తల్లిదండ్రులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యం*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో కుంటాల, నవంబర్ 5:–
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాలతో భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని కుంటాల గ్రామ సర్పంచ్ జక్కుల గజేందర్, ఈఓ బండారి రాజబాబు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి ప్రతి చుక్కను పొదుపుగా వినియోగించుకోవడం ఎంతో అవసరమని, భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రభావాలు, వాతావరణ మార్పులు, నీటి పొదుపు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కుంటాల మండల కేంద్రంలోని విజయ సాయి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురువారం కుంటాల బస్టాండ్ ఆవరణలో వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన అవగాహన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు రైతులు, గ్రామ సర్పంచులు, వ్యవసాయ అధికారుల వేషధారణలో పాల్గొని ఎల్‌నినో ప్రభావాల వల్ల వర్షపాతం తగ్గడం, అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు, వాటి ప్రభావం వ్యవసాయ రంగంపై ఎలా ఉంటుందనే అంశాలను తమదైన శైలిలో వివరించారు. ముఖ్యంగా నీటి కొరత ఏర్పడితే రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను చిన్నారులు తమ ప్రదర్శన ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జక్కుల గజేందర్ మాట్లాడుతూ వర్షాలు తక్కువగా కురిసినప్పుడు భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఇంట్లో నీటి వృథాను అరికట్టడంతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టే విధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులను సంరక్షించుకోవాలని అన్నారు. చిన్నారులు ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈఓ బండారి రాజబాబు మాట్లాడుతూ వాతావరణ మార్పులపై ముందస్తు అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. ఎల్‌నినో ప్రభావాల కారణంగా వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు నీటి పొదుపు ఆవశ్యకతను వివరించడం మంచి పరిణామమని అన్నారు. ప్రతి ఇంట్లో నీటి సంరక్షణను ఒక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహణలో ప్రధాన ఉద్దేశం చిన్నారుల ద్వారా వారి తల్లిదండ్రులకు, కుటుంబ పెద్దలకు ఎల్‌నినో ప్రభావాలపై అవగాహన కల్పించడం, రానున్న వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే నీటిని పొదుపు చేసే అలవాటును పెంపొందించడం. పిల్లలు నేర్చుకున్న విషయాలను ఇంట్లో పెద్దలకు తెలియజేయడం ద్వారా ప్రతి కుటుంబంలో నీటి సంరక్షణపై చైతన్యం తీసుకురావడమే విజయ సాయి కోచింగ్ సెంటర్ లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల వినూత్న వేషధారణలు, సందేశాత్మక ప్రదర్శనలు స్థానికులను ఆకట్టుకున్నాయి. నీటిని కాపాడితేనే భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పించగలమనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది.


