*ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి*
*డిసెంబర్ 15 నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలి*
*సీఐటీయూ మంచాల మండల కన్వీనర్ పోచమోని కృష్ణ*
మంచాల, నవంబర్ 3 (ప్రజావాణి):
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 3 (ప్రజావాణి) మంచాల ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15వ తేదీ నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ మంచాల మండల కన్వీనర్ పోచమోని కృష్ణ పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో మంచాల మండలంలోని ఆశా వర్కర్లందరూ పాల్గొంటారని తెలిపారు.
ఈ సందర్భంగా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులను అందజేశారు. అనంతరం పోచమోని కృష్ణ మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేపడతారని తెలిపారు.
ప్రజారోగ్య వ్యవస్థలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల స్థిర వేతనం చెల్లించాలని, రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, ప్రసూతి ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు అందించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా పదవీ విరమణ సమయంలో రూ.5 లక్షల ప్రయోజనం కల్పించడంతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రతి ఆదివారం, పండుగ రోజుల్లో సెలవులు, సంవత్సరానికి 20 రోజుల సాధారణ సెలవులు, ఆరు నెలల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని అన్నారు. అర్హత కలిగిన ఆశా వర్కర్లకు పదోన్నతి అవకాశాలు కల్పించాలని, రెండో వేతన సవరణ సంఘంలో ఆశా వర్కర్లకు కనీసం రూ.30 వేల వేతనం నిర్ణయించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ఆశా వర్కర్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

