చింతకానిలో డిప్యూటేషన్ అధికారి..!
సర్దుబాటు లో భాగంగా విధులు
*చిన్న మండవలో ఓటీపీలు ఓసీలు లేని ఇసుక అక్రమ రవాణా…?
*పేరుకే కూపన్లు.. జరిగేదంతా దంధానేనా..?
*ఇసుక అక్రమ రవాణాలో కీలకంగా మారిన కొందరు…?
*క్షేత్రస్థాయిలో తనిఖీలు రసీదులు పరిశీలించని ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్…?
*రంగంలోకి దిగిన ప్రైవేటు గుంపు…?
*మురసు “తుఫాను”లోను కొనసాగిన దందా…?
*అనుమతులు లేకుండా ఇసుక రీచ్ లో కి ప్రవేశం
*అధికారులకు తెలిసే జరుగుతోందా..?
*అసహనం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు హక్కుల సంఘాలు…!
*మన ప్రజావాణి కథనాలపై ఆరా.. కొందరి గరంగరం…!
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ మున్నేరు ఇసుక క్వారీలో ఎటువంటి ఓటీపీలు ఓసీలు రికార్డులు లేకుండా అక్రమంగా నిత్యం సుమారు 70 నుండి 80 ట్రాక్టర్లు చింతకాని బోనకల్ ఖమ్మం ప్రాంతాలకు ఇసుకను విచ్చలవిడిగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ మైనింగ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాన్స్పోర్ట్ అధికారుల్లో చలనం లేకపోవడం సంచలనం కలిగిస్తోంది. అవినీతికి అక్రమాలకు అలవాటు పడిన కొందరు అధికారులు ఇసుక ప్రాంతానికి చేరుకునే లోపు సుమారు తెల్లవారుజామున 5 గంటల నుండి ఉదయం 10 గంటల లోపు ఇసుకను ఎటువంటి అనుమతులు లేకుండా నింపుకొని అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత రెవెన్యూ అధికారులు విధులకు హాజరు అయ్యే సమయంలో సుమారు 30 నుండి 40 ట్రాక్టర్లు వేచి ఉన్నప్పటికీ మాన్యువల్ బిల్లులు ఆమోదంతో ఎటువంటి ఓటీపీలు ఓసి లు లేకుండా దర్జాగా రవాణాకు పాల్పడుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారుల్లో చలనం లేకపోవడం పట్ల పలు విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గత తుఫాను నేటి మురసు వలన వర్షం పడుతున్నప్పటికీ యధావిధిగా ఇసుక అక్రమ రవాణా జరగటం విశేషం. ప్రధానంగా చిన్న మండవ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా మన ప్రజావాణి తెలుగు దినపత్రిక వరుస సమగ్ర కథనాలు అందించినప్పటికీ నేటికీ సంబంధిత జిల్లా స్థాయి అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్ చెల్లింపులు చెల్లించి ఓటీపీలు ఓసీలు ద్వారా నిర్దిష్టంగా కూపన్లు పొందిన వారికి ఇసుకను అందించడం ప్రభుత్వ నిబంధన అయినప్పటికీ కొందరు రెవెన్యూ అధికారుల అండదండలతో పలుకుబడి పరపతి అర్ధబలం అంగ బలం తో విచ్చలవిడిగా ఇసుక రవాణా జరగటంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా పరిపాలన సర్దుబాటులలో భాగంగా జిల్లా కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఓ అధికారిని సుమారు మూడు సంవత్సరాల క్రితం చింతకాని మండలానికి డిప్యూటేషన్ పై నాటి కలెక్టర్ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సదరు రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో ఇసుక ప్రాంతాన్ని పరిశీలించకపోవడం ఆ ఏరియాలలో తనిఖీలు నిర్వహించకపోవడం విశేషం. ప్రభుత్వ ఇసుకను సరఫరా కేంద్రం వద్ద అప్పుడప్పుడు తనిఖీలు ఇతర రెవిన్యూ విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వెనుక పలు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ రెవెన్యూ అధికారి స్వగ్రామం నుండి సుమారు 15 నుండి 20 ట్రాక్టర్లు నిత్యం చిన్న మండవ ఇసుక ర్యాంపు నుండి ఇసుకను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నట్లు పలువురు స్థానికులు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మైనర్లు డ్రైవర్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా సరియైన ట్రాన్స్పోర్ట్ ధ్రువీకరణలు లేకపోయినప్పటికీ మితిమించిన వేగంతో రాకపోకలు సాగిస్తూ ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనదారులకు నిత్యం చుక్కలు చూపిస్తున్నట్లు కొందరు ఉద్యోగులు వాహనదారులు ఆరోపిస్తున్నారు. కాగా కొందరు ప్రైవేటు వ్యక్తులు రంగ ప్రవేశం చేసి ఇసుక అక్రమ రవాణా సాఫీగా జరిగేందుకు మంత్రాంగం నడిపి ప్రజావాణి కథనాలపై.. ఆరాలు ఎంక్వయిరీలు చేస్తూ చిన్న మండవ వ్యవహారంపై వార్తలు ఎలా రాస్తారు ఎందుకు రాస్తున్నారు అంటూ అంటూ బెదిరింపులకు పాల్పడే యత్నం చేసినట్లు తెలిసింది. పైగా ఓటీపీలు ఓసీలు లాంటివి అధికారులు చూసుకోవాలి.. అయినా మాకు ఉపాధి ఈ ఇసుక అడగటానికి పేపర్లో రాయటానికి మీరెవరు అంటూ గరం గరం గా వ్యవహరించడం కొందరు బడా బాబులు కొంతమంది దీంట్లో కీలక సూత్రధారులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి చిన్న మండవ ఇసుక క్వారీలో జరిగే అక్రమాలపై సమగ్ర విచారణ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు మండల ప్రజలు కోరుతున్నారు.




