గురుకులాల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
విద్యార్థి ఫినాయిల్ తాగిన ఘటనపై సబ్ కలెక్టర్‌కు తల్లిదండ్రుల సంఘం వినతి
నారాయణఖేడ్, అక్టోబర్ 31 (ప్రజావాణి):
గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి నెల అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సాపూర్ శంకర్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రమేష్ కోరారు. నారాయణఖేడ్ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హర్షిత్ గౌడ్ ఫినాయిల్ తాగి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఘటనపై వారు స్పందించారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ విషయంలో ప్రిన్సిపాల్‌కు భయపడి విద్యార్థి ఈ చర్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి గురుకులంలో పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి, ప్రతినెలా సమావేశాలు నిర్వహించాలని కోరారు. నెలకు రెండుసార్లు విద్యార్థులకు మానసిక ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే విధానం, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.గురుకుల పాఠశాలలను ఉన్నతాధికారులు తరచూ సందర్శించి విద్యార్థుల సమస్యలు, వసతి, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ మేరకు సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ డివిజన్ నాయకుడు మోహన్, తల్లిదండ్రుల సంఘం జిల్లా కమిటీ సభ్యుడు అశోక్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.

