జైలు సందర్శన, బాలికలకు భరోసా..
-ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31 (ప్రజావాణి) : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం రెండు చోట్ల న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ శంకర శ్రీదేవి, ఈ కార్యక్రమాల్లో పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు.
మొదటగా జనగామ లోని సబ్ జైలును సందర్శించిన జడ్జి అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలు, విచారణ ఖైదీలతో నేరుగా మాట్లాడారు. వారి ఆరోగ్య, వసతి సమస్యలు, కేసుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ పోక్సో చట్టం గురించి వివరంగా తెలియజేశారు. చిన్నారుల పై జరిగే నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని, తెలియక చేసినా శిక్ష తప్పదని హెచ్చరించారు. అలాగే డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వల్ల జీవితాలు ఎలా నాశనం అవుతాయో, కుటుంబాలు ఎలా రోడ్డున పడతాయో వివరించారు.
ఖైదీలకు ఉన్న హక్కులను కూడా వివరించారు. “రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఉంది. ఒకవేళ న్యాయవాదిని పెట్టుకోలేని పేద స్థితిలో ఉంటే, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మీకు పూర్తిగా ఉచితంగా న్యాయవాదిని అందిస్తుందని, ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయండి” అని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ కృష్ణ కాంత్, జైలు సిబ్బంది, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం మధ్యాహ్నం బాలసదన్ గర్ల్స్ హోమ్ ను సందర్శించారు. అక్కడ ఉన్న బాలికలతో ఆప్యాయంగా మాట్లాడారు.
బాలికలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ, మంచి తాకడం, చెడు తాకడం (Good Touch – Bad Touch) లాంటి వాటి గురించి వివరించారు.
“ఎవరైనా అపరిచితులు మీతో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తే, బహుమతులు ఇస్తామని ఆశ చూపితే, పాఠశాల నుంచి ఇంటి వరకు మిమ్మల్ని ఫాలో అవుతుంటే, మీపై అనుమానాస్పదంగా ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటే భయపడవద్దు. వెంటనే ధైర్యంగా హోమ్ సూపరింటెండెంట్ కు గానీ, మీ పాఠశాల ఉపాధ్యాయులకు గానీ, లేదా నేరుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు గాని ఫోన్ చేసి చెప్పండి. మీ భద్రతకు మేము ఉన్నాం. అందరూ శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలి” అని బాలికలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమం బాలికల్లో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపింది.

