📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బడిలో ‘రంపపు’రాక్షసుడు: రాప్తాడు విద్యామందిరంలో ఉన్మాది ఘాతుకం.సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండించాల్సిన దారుణం!

బడిలో ‘రంపపు’రాక్షసుడు: రాప్తాడు విద్యామందిరంలో ఉన్మాది ఘాతుకం.సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండించాల్సిన దారుణం!

📰 Generate e-Paper Clip

అనంతపురం (రాప్తాడు)అక్టోబర్ 31 ప్రజావాణి జ్ఞానాన్ని ప్రసాదించాల్సిన విద్యా మందిరం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. తోటి విద్యార్థులతో కలిసి ప్రశాంతంగా పాఠాలు వినాల్సిన క్లాస్‌రూమ్‌లో భయాందోళనలు రేగాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చోటుచేసుకున్న ఉన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న ఒక చిన్నారిపై ఓ నరరూప రాక్షసుడు చెట్లు నరికే కోతమిషన్ (రంపం) తో విచక్షణారహితంగా దాడికి తెగబడటం మానవత్వాన్ని నిలువునా దహించివేసింది. ఈ హృదయ విదారకర ఘటనను సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కళ్లెదుటే దారుణం. క్లాస్‌రూమ్‌లోనే ఊచకోత!

పాఠశాలలో యథావిధిగా తరగతులు జరుగుతున్న సమయంలో హేమంత్ అనే ఉన్మాది పాఠశాల ఆవరణలోకి చొరబడ్డాడు. నేరుగా పదో తరగతి గదిలోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న ఎలక్ట్రిక్ రంపం మిషన్‌తో ఒక విద్యార్థినిపై దాడికి దిగాడు,ఆ ఉన్మాది సృష్టించిన బీభత్సానికి బాలిక ముఖం,తల,వీపు భాగాల్లో తీవ్ర గాయాలై, రక్తం మడుగులో స్పృహతప్పి పడిపోయింది. తోటి స్నేహితురాలిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించి అడ్డొచ్చిన మరో విద్యార్థినిపై కూడా ఆ రక్కసి దాడి చేయడంతో ఆమెకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. పుస్తకాలు, బ్యాగులు చెల్లాచేదురుగా పడి, క్లాస్‌రూమ్ మొత్తం రక్తసిక్తం కావడం చూసి తోటి పిల్లలు, ఉపాధ్యాయులు హాహాకారాలు చేస్తూ ప్రాణభయంతో పరుగులు తీశారు.మంత్రి లోకేష్ సత్వర స్పందన అభినందనీయం!ఈ దారుణ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత వేగంగా స్పందించడం అభినందనీయం. “చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది” అంటూ మంత్రి లోకేష్ అత్యంత భావోద్వేగానికి గురయ్యారు. ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా ఉన్మాదులను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, నిందితుడిని త్వరగా అదుపులోకి తీసుకోవడం ఊరట కలిగించే అంశం.ఉపాధ్యాయులపై చర్యలు బాధాకరం.. మనోధైర్యం కల్పించాల్సిన సమయం!ఇంతటి ఘోర విపత్తు కళ్లముందు జరగడంతో విద్యార్థులతో పాటు క్లాస్ టీచర్, హెడ్‌మాస్టర్ తీవ్రమైన దిగ్భ్రాంతికి, భయాందోళనలకు గురయ్యారు.ఉన్మాది చేతిలో రంపం చూసి కొందరు ఉపాధ్యాయులు స్పృహ తప్పి పడిపోయేంత మానసిక వేదనను అనుభవించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాల సిబ్బందికి, ఉపాధ్యాయులకు అండగా నిలిచి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సింది పోయి.తక్షణమే హెచ్ఎం,టీచర్‌పై చర్యలకు (సస్పెన్షన్‌కు) పూనుకోవడం నిజంగా బాధాకరం. ఊహించని ఉన్మాద దాడికి గురై భయాందోళనల్లో ఉన్న ఉపాధ్యాయ లోకానికి ఈ చర్య మరింత ఆవేదనను కలిగిస్తోంది. అధికారులు ఈ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిన అవసరం ఉంది.భద్రతా వ్యవస్థపై పునరాలోచన.డిమాండ్లు ఇవే:ఈ ఘాతుకం కేవలం ఒక విద్యార్థినిపై జరిగిన దాడి మాత్రమే కాదు.. మొత్తం విద్యా వ్యవస్థకే ఒక పెద్ద హెచ్చరిక. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే కింది చర్యలు చేపట్టాలి: ఆలోచించడానికే భయపడేలా శిక్షలు: ఇలాంటి అకృత్యాలకు పాల్పడాలని కలగనడానికి కూడా ఏ ఒక్కడూ సాహసించనంత కఠినంగా,ఆ మానవమృగంపై చట్టపరమైన ఉక్కుపాదం మోపాలి.మెరుగైన వైద్యం: గాయపడిన ఇద్దరు బాధిత విద్యార్థినులకు ప్రభుత్వం తరఫున అత్యుత్తమ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడటంతో పాటు తగిన మనోధైర్యాన్ని ఇవ్వాలి. పటిష్టమైన భద్రతా వ్యవస్థ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యందు సీసీటీవీ కెమెరాలు, పటిష్టమైన సెక్యూరిటీ గార్డుల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గుర్తు తెలియని వ్యక్తులు విద్యాసంస్థల ఆవరణలోకి రాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలి.రాప్తాడు పాఠశాలలో జరిగిన ఈ ఉన్మాది దాడిని పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండించాల్సిన పరిస్థితి నేడు ఏర్పడింది. భవిష్యత్తులో ఏ తల్లిదండ్రులూ తమ పిల్లలను బడికి పంపడానికి భయపడని రోజొచ్చేలా విద్యాశాఖ, పోలీస్ శాఖ కఠినమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు, గళమెత్తుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.