దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, అక్టోబర్ 31:
దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు పిలుపునిచ్చారు.
జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు, జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ ప్రజలలో మనమంతా భారతీయులమనే భావనను సుస్థిరం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు.
ఆయన ఉక్కు సంకల్పాన్ని భావితరాలు ఆదర్శంగా తీసుకుని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుతూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తామని, దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని అదనపు కలెక్టర్ జిల్లా అధికారులతో, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

