*మద్యం మత్తులో పట్టుబడిన వ్యక్తిపై ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దాడి?*
*చెంపలపై కొట్టడంతోపాటు సెల్‌ఫోన్ లాక్కున్నారని బాధితుడి ఆరోపణ*
మేడ్చల్ అక్టోబర్ 23 (పీపుల్స్ డైరీ) మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తిపై ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. కిష్టాపూర్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బాధితుడు కలవలి గిరి తెలిపాడు.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ ట్రాఫిక్ ఎస్ఐ పరశురాం ఆధ్వర్యంలో శుక్రవారం కిష్టాపూర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కలవలి గిరి మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించి పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అనంతరం తన ద్విచక్ర వాహనాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతూ, మద్యం సేవించని మరో వ్యక్తి ద్వారా తన స్నేహితుడిని పిలిపించి వాహనం అప్పగించాలని గిరి కోరినట్లు తెలిపాడు. ఈ సమయంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ తన తల్లిని దుర్భాషలాడుతూ చెంపలపై ఇష్టానుసారంగా కొట్టారని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా తన సెల్‌ఫోన్‌ను కూడా లాక్కున్నారని పేర్కొన్నాడు.
మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమైనప్పటికీ, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు చట్టపరిధిలోనే వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ఘటనపై బాధితుడి ఆరోపణలను పరిశీలించి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేపడతారా అనే అంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

