*జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి*
*– ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, ఇళ్ల బిల్లుల సాధనకు పోరాటం*
*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 23 సంగారెడ్డి జిల్లా*
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునిగాల మాణిక్ ప్రభు అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, ఇళ్ల బిల్లులు మంజూరు చేయించేందుకు సంఘం తరఫున కృషి చేస్తామని తెలిపారు. శుక్రవారం నారాయణఖేడ్ పట్టణంలోని స్వర్ణకార భవనంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నారాయణఖేడ్ డివిజన్ మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. డివిజన్ కార్యదర్శి ఎం.ఏ. ఖైసర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి ఫెడరేషన్ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడంతో పాటు, ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, ఇళ్ల బిల్లుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ సంఘాన్ని బలోపేతం చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి అవసరమని నాయకులు అభిప్రాయపడ్డారు.

