శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 21(ప్రజావాణి):
శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడడంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Commemoration Day) సందర్భంగా రఘునాథపల్లి మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. “1959 అక్టోబర్ 21న లడఖ్ లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా దళాల దాడిలో అసువులు బాసిన 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 191 మంది పోలీసు సిబ్బంది అమరులయ్యారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.”
“నేటి సమాజంలో సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, గంజాయి, డ్రగ్స్ వంటి నూతన తరహా నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, మారుతున్న నేర ధోరణులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, నేరాలను వేగంగా ఛేదిస్తున్న జనగామ జిల్లా పోలీసుల పనితీరు అభినందనీయమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతో పాటు రెవెన్యూ, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.”
“అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వారి పిల్లల చదువులు, ఉపాధి విషయంలో అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.”
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐలు వేణు, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్, దేవేందర్, భరత్ సుమన్, స్థానిక ఎస్‌ఐ మోదుగు భరత్, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.

