టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి..
డా.శ్రీకాంత్ గౌడ్ కు అభినందనల వెల్లువ.
ప్రజావాణి,ఇనుగుర్తి: ఉద్యమ నేత బీసీ ముద్దుబిడ్డ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ ను వరంగల్ ఖమ్మం నల్గొండ తెలంగాణ రక్షణ సేన పార్టీ (టిఆర్ఎస్)ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించడంతో శ్రీకాంత్ గౌడ్ అభినందనల పరంపర కొనసాగుతోంది. మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన టిఆర్ఎస్వి జిల్లా నాయకులు మహమ్మద్ మోను, మహమ్మద్ ఆసిఫ్, షేక్ సువనక్కర్ ,షేక్ రజాక్ ప్రభృతులు శ్రీకాంత్ గౌడ్ ను కలిసి అభినందించి ఘనంగా సన్మానించారు. టికెట్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ గౌడ్ గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం విధితమే. పీహెచ్డీ పట్టాభిందిన విద్యాధికులు డా. శ్రీకాంత్ గౌడ్ కు ప్రజా సమస్యల తో పాటు విద్యారంగం, నిరుద్యోగం,కార్మిక,కర్షిక వెరసి అన్ని సమస్యల పై అపారమైన విషయ పరిజ్ఞానం కలిగి ఉండడం,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్న శ్రీకాంత్ గౌడ్ ను గ్రాడ్యుయేట్లు,అనేక సంఘాల నాయకులు విద్యావంతులు మేధావుల నుంచి అనూహ్యమైన మద్దతు అభినందనలు కొనసాగుతున్నాయి. విజయదశమి పురస్కరించుకొని శ్రీకాంత్ గౌడ్ స్వగ్రామం చిన్ననాగారానికి రావడంతో విషయం తెలుసుకున్న ఇనుగుర్తి మండల గ్రాడ్యుయేట్లు మంగళవారం సాయంత్రం శ్రీకాంత్ గౌడ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు తినిపించారు.
కృతజ్ఞతలు తెలిపిన శ్రీకాంత్ గౌడ్..
ఉద్యమ స్ఫూర్తి పోరాట పటిమను గుర్తించి తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, తన అభ్యర్థిత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మద్దతు ప్రకటిస్తున్న వారందరికీ డా.శ్రీకాంత్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలపై పోరాడుతూ నిరంతరం అందుబాటులో ఉండే తనకు అన్ని వర్గాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని ప్రజల పక్షాన బరి గీసి పోరాడే తనకు పట్టభద్రులు మద్దతు పలకాలని అభ్యర్థించారు.

