📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసంగారెడ్డి జిల్లాలో క్రషర్ మాఫియా వీరంగం

సంగారెడ్డి జిల్లాలో క్రషర్ మాఫియా వీరంగం

📰 Generate e-Paper Clip

*సంగారెడ్డి జిల్లాలో క్రషర్ మాఫియా వీరంగం..!*
*పవిత్ర భవాని దీక్షలో ఉన్న భక్తులపై దాడి.. ఏడ్దనూర్ తండాలో ఉద్రిక్తత..!*
*ప్రశ్నించిన భక్తులపై అసభ్య పదజాలంతో దూషణ.. చేయి చేసుకున్న జీఏ క్రషర్ యాజమాన్యం*

*ఘటనపై బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్ర రమేష్ చౌహాన్ తీవ్ర ఆగ్రహం.. నిందితులపై చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ఆందోళనలేనని అల్టిమేటం*

*భవాని దీక్షాదారులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం – కర్ర రమేష్ చౌహాన్*
*ఏడ్దనూర్ తండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జీఏ క్రషర్.. అడ్డు అదుపు లేకుండా బ్లాస్టింగ్ లు.. తండా మొత్తం దుమ్ముమయం*

*సంగారెడ్డి/కంది, అక్టోబర్ 7 (ప్రజావాణి ప్రతినిధి బాల రాజు):*

సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఏడ్దనూర్ తండా వద్ద ఉన్న జీఏ క్రషర్ యాజమాన్యం ఆగడాలు రోజురోజుకీ శృతి మించుతున్నాయి. డబ్బు, అధికార మదంతో తండా గిరిజన ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, ఏకంగా పవిత్రమైన భవాని దీక్షలో ఉన్న భక్తులపైనే దాడికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటనతో ఏడ్దనూర్ తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న భవాని భక్తులు, బంజారా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

*బ్లాస్టింగ్ పేరుతో తండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం..*
మంగళవారం మధ్యాహ్నం జీఏ క్రషర్ లో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా విపరీతంగా బ్లాస్టింగ్ నిర్వహించారు. ఈ బ్లాస్టింగ్ ధాటికి ఏడ్దనూర్ తండా పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున దుమ్ము, ధూళి వ్యాపించింది. ఒక్కసారిగా తండా మొత్తం దుమ్ము తెరలతో కమ్మేసింది. ఇళ్లలోకి, వంట గదుల్లోకి, తాగే నీటిలోకి సైతం దుమ్ము చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఊపిరి పీల్చుకోలేక అవస్థలు పడ్డారు. గత కొంతకాలంగా ఇదే తంతు కొనసాగుతుండడంతో తండా ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్రషర్ వల్ల తమ భూములు, పంటలు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*ప్రశ్నించిన పాపానికి భక్తులపై దాడి.. క్రషర్ యాజమాన్యం దౌర్జన్యం..*
ఈ విషయంపై క్రషర్ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు, తమ బాధను చెప్పుకునేందుకు కొంతమంది భవాని దీక్షాదారులు అత్యంత వినయంగా క్రషర్ వద్దకు వెళ్లారు. అయితే వారి బాధను వినాల్సిన యాజమాన్యం.. వారిపైనే విరుచుకుపడింది. “మ్మల్ని ప్రశ్నించేందుకు మీరెవరు?” అంటూ దురుసుగా ప్రవర్తించింది. అత్యంత పవిత్రంగా భావించే భవాని మాలలో ఉన్న భక్తులను కనీసం గౌరవించకుండా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ఏకంగా వారిపై చేయి చేసుకుని భయభ్రాంతులకు గురి చేసినట్లు బాధితులు కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్నారు. భక్తి పారవశ్యంలో, ఉపవాస దీక్షలో ఉన్న వారిపై దాడి చేయడం దేవుడిపైనే దాడి చేసినట్లేనని స్థానికులు మండిపడుతున్నారు.

*బంజారా సంఘం ఫైర్ – ఎస్పీకి అల్టిమేటం – కర్ర రమేష్ చౌహాన్ సంచలన హెచ్చరిక..
*బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్ర రమేష్ చౌహాన్* తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “అత్యంత పవిత్రంగా భావించే భవాని దీక్షలో ఉన్న దీక్షాదారులపై జీఏ క్రషర్ యాజమాన్యం దాడి చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు, క్షమించరాని నేరం. ఈ దాడిని మా బంజారా సేవాలాల్ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

“ప్రజల ఆరోగ్యం, తండా ప్రజల భద్రతకు ఇబ్బంది కలిగించే విధంగా ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్ లు నిర్వహిస్తున్న జీఏ క్రషర్ పై అధికారులు తక్షణమే స్పందించాలి. ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించి, భవాని దీక్షాదారులపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

“ఒకవేళ అధికారులు ఈ ఘటనను నిర్లక్ష్యం చేస్తే, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న బంజారా, గిరిజన, భవాని భక్త సంఘాలన్నీ ఏకమై ప్రజాస్వామ్య పద్ధతిలో రాస్తారోకోలు, భారీ ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి క్రషర్ ను ముట్టడిస్తామని” పత్రికాముఖంగా తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
ఈ ఘటనతో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న భవాని దీక్షాదారులు, బంజారా సంఘాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో క్రషర్ యాజమాన్యం తీరుపై విమర్శల వెల్లువెత్తుతోంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.