*అయ్యా అధికారులారా… ఒకసారి పెద్ద శంకరంపేట వైపు చూడండి! చెత్తతో నరకమైపోయిన ఊరు – రోగాల బారిన పడుతున్న ప్రజలు – కన్నీటిలో మా మత్స్యకారుల బతుకులు*
*పెద్ద శంకరంపేట, ప్రజావాణి ప్రతినిధి: బాలరాజు*
*ఊరు ఏడుస్తోంది అయ్యా…*
మెదక్ జిల్లాలోనే పెద్ద శంకరంపేట మండల కేంద్రం, ఎంతో అభివృద్ధి చెందాల్సిన పెద్ద శంకరంపేట నేడు కన్నీరు పెడుతోంది. పొద్దున్నే లేచి భగవంతుడిని తలుచుకోవాల్సిన ప్రజలు, ముక్కు మూసుకుని చెత్త దుర్గంధాన్ని భరిస్తూ బతుకుతున్నారు.
*మమ్మల్ని కాపాడాల్సిన పంచాయతీయే మా పాలిట శాపమా?*
ఇది నిజంగా చాలా బాధాకరం అయ్యా. ప్రతి రోజు పొద్దున్నే పంచాయతీ ట్రాక్టర్ వస్తుంది, ఇంటింటి చెత్తను తీసుకుంటుంది. ప్రజలు అనుకుంటారు – “అమ్మయ్య, మా ఊరు శుభ్రంగా అవుతోంది” అని. కానీ ఆ ట్రాక్టర్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా?
మా ఊరి పిల్లలు స్కూల్ కు వెళ్లే నాడీ రోడ్డు పక్కన, మా రైతులు పొలాలకు వెళ్లే దారిలో, మా ఆడబిడ్డలు నడిచే నడి రోడ్డుపై ఆ చెత్తను కుప్పగా పోసి వెళ్తోంది.
*ఈ దృశ్యం చూస్తే కడుపు తరుక్కుపోతోంది…*
రోడ్డు పక్కన ప్లాస్టిక్ కవర్లు గాలికి ఎగురుతున్నాయి, కుళ్లిన చెత్త నుండి పురుగులు వస్తున్నాయి, భరించలేని వాసన. ఆ దారి వెంట వెళ్లే చిన్న పిల్లలు వాంతులు చేసుకుంటున్నారు. గర్భిణీ స్త్రీలు ఆ దారిలో నడవలేకపోతున్నారు.
అయ్యా, ప్రజలకు అండగా ఉండాల్సిన గ్రామ పంచాయతీ ఇలా చేస్తే, ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? మేము రోడ్డు పక్కన చెత్త వేయొద్దంటే, పంచాయతీ వారే వేస్తుంటే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
*ఇప్పుడు అసలు భయం – రోగాల భయం – పిల్లలకు, పెద్దలకు ప్రాణ సంకటం!*
అయ్యా, ఇది కేవలం దుర్గంధం సమస్య కాదు, ఇది ప్రాణాల సమస్య.
దోమల బెడద – డెంగ్యూ, మలేరియా,రోడ్డు పక్కన కుళ్లిన చెత్త, చెరువులో కుళ్లిన చికెన్ వ్యర్థాలతో దోమలు లక్షల్లో పెరిగిపోయాయి. సాయంత్రం అయితే ఇంట్లో ఉండలేని పరిస్థితి. చిన్న పిల్లలకు డెంగ్యూ, మలేరియా జ్వరాలు వస్తున్నాయి. గత నెలలోనే 10 మందికి పైగా జ్వరాలతో ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లారు.
చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు: చెత్త నుండి వచ్చే దుర్గంధంతో, ఈగలతో చర్మంపై దద్దుర్లు, దురదలు వస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నారు.
వాంతులు, విరేచనాలు చెరువు నీరు కలుషితమై, ఆ నీటి ఆవిరితో, ఈగలతో ఆహారం కలుషితమై వాంతులు, విరేచనాలు అవుతున్నాయి.
“మా పిల్లలకు రోగాలు వస్తే మేము ఎక్కడికి పోవాలి? ప్రభుత్వ హాస్పిటల్ లో మందులు లేవు, ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్తే 5 వేలు అయిపోతోంది” అని ఒక తల్లి కన్నీటితో చెబుతుంటే చూసే వారికి గుండె తరుక్కుపోతోంది.
*మా చిన్న కోరిక ఒక్కటే:*
“అయ్యా, దయచేసి ఊరి దగ్గర చెత్త వేయొద్దు. పెద్ద శంకరంపేట శివారు అవతల ప్రాంతంలో, ఎవరూ నివసించని దూర ప్రాంతంలో ఒక శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయండి. మా ఊరిని కాపాడండి” అని ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి వేడుకుంటున్నారు.
ఇది ఏ ఒక్క అధికారిని ఉద్దేశించి మాట్లాడింది కాదు అయ్యా, ఇది ప్రతి ఒక్క అధికారి – సర్పంచ్ గారు, కార్యదర్శి, MPDO అందరూ ముందుండి చేయాల్సిన పని.
*మత్స్యకారుల కథ – పెట్టుబడి కూడా రాక అప్పుల పాలైన బతుకులు*
మా చెరువు కథ. మా పెద్ద శంకరంపేట పెద్ద చెరువు… ఒకప్పుడు నిండుగా నీటితో, చేపలతో కళకళలాడేది. ఆ చెరువుపై 140 మత్స్యకార కుటుంబాలు బతుకుతున్నాయి.
ప్రతి సంవత్సరం, ఆ మత్స్యకారులు తమ భార్యల బంగారాన్ని తాకట్టు పెట్టి, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చి, రూ. లక్ష, లక్షన్నర పెట్టి చేప పిల్లలను చెరువులో వదులుతారు. “ఈసారైనా పంట బాగా వచ్చి, పిల్లలకు మంచి బట్టలు కొనాలి, అప్పులు తీర్చాలి” అని కలలు కంటారు.
కానీ ఏం జరుగుతోంది? రాత్రికి రాత్రి కొందరు చికెన్ సెంటర్ వాళ్లు కోళ్ల పేగులు, రక్తం, ఈకలు, కుళ్లిన మాంసం వ్యర్థాలను తెచ్చి మా చెరువులో గుమ్మరిస్తున్నారు. చెరువు నీరు నల్లగా, విషంగా మారిపోతోంది. చేపలు ఉక్కిరిబిక్కిరి అయి చనిపోయి నీటిపై తేలుతున్నాయి.
మత్స్యకారన్న కన్నీళ్లు పెట్టుకుని అన్న మాట ప్రతి సంవత్సరం పెట్టిన పెట్టుబడి కంటే అప్పుల పాలవుతున్నాం అన్నా. ఈ చెరువు మా పాలిట శాపంగా మారింది అన్నా. మా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం. ఇది ఏ అధికారిని తిట్టడం కాదు మా బతుకులు కాపాడమని అడుగుతున్నాం”
*అధికారులు వెంటనే స్పందించాలి, లేనియెడల కలెక్టర్ గారి దగ్గరకు వెళ్తాం*
ఇన్ని రోజులు ఓపిక పట్టాం. ఇక ఓపిక నశించింది. అందుకే గ్రామ ప్రజలు, మత్స్యకారులు, యువకులు, మహిళలు అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు.
అయ్యా అధికారులారా, మీరు ఈ వారం రోజుల్లో స్పందించి, నాడీ రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించి, ఊరి శివారు అవతల డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి, చెరువులో చికెన్ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోకపోతే, మేము చేసేది ఒక్కటే…”
మేమందరం కలిసి, మా పిల్లలతో, మా కుటుంబాలతో మెదక్ కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం. మా బాధను కలెక్టర్ గారికి చెప్పుకుంటాం.
అయ్యా, ఇది బతుకు కోసం, మా పిల్లల ఆరోగ్యం కోసం చేసే పోరాటం.
*జిల్లా పంచాయతీ అధికారి గారికి విజ్ఞప్తి:*
అయ్యా, ఒకసారి పెద్ద శంకరంపేట వైపు చూడండి. మా ఊరిని కాపాడండి. శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయండి. మా చెరువును, మా మత్స్యకారుల బతుకులను, మా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు



