*జనగాంలో నూతన స్వచ్ఛ ఆటోల ర్యాలీ ఘనంగా ప్రారంభం*
జనగాం, సెప్టెంబర్ 29 (ప్రజావాణి న్యూస్):
జనగాం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు నూతనంగా అందుబాటులోకి వచ్చిన *స్వచ్ఛ ఆటోల ర్యాలీని* ఘనంగా నిర్వహించారు.
మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీకి మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్ రెడ్డి లు జెండా ఊపి ప్రారంభించారు. నూతన స్వచ్ఛ ఆటోలకు పూలమాలలు వేసి, పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు.
*తడి, పొడి చెత్త వేరు చేయాలని అవగాహన*

ఈ సందర్భంగా ప్రతి వార్డులో ఇంటింటి నుంచి *తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం*, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని నూతన స్వచ్ఛ ఆటోల ర్యాలీని విజయవంతం చేశారు.
*పరిశుభ్రమైన జనగాం – స్వచ్ఛ జనగాం లక్ష్యం*
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ *కడకంచి బాలమణి శ్రీనివాస్* మాట్లాడుతూ, *“పరిశుభ్రమైన జనగాం – స్వచ్ఛ జనగాం”* లక్ష్యంగా మున్సిపాలిటీ నిరంతరం పనిచేస్తోందని, ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించి తమ ఇళ్లలోనే తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందించాలని కోరారు.

