నంగునూరు, సెప్టెంబర్ 26:అంతర్జాతీయ సాప్ట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికైన సిద్ధిపేట నియోజకవర్గం నంగునూరు మండలం గట్ల మాల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని బానోతు ఈశ్వరి అంతర్జాతీయ సాఫ్ట్బాల్ పోటీలలో అద్భుతంగా రాణించాలని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆకాంక్షించారు.ఎంపికై సిద్దిపేట జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా చైనాలో నిర్వహించనున్న సాఫ్ట్ బాల్ సబ్ జూనియర్ ఆసియా క్రీడా పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఈశ్వరి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావును కలిశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు ఈశ్వరిని అభినందించారు. ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసించారు.
గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి, ఇప్పుడు భారత జట్టు తరఫున అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట నుంచి ఒక విద్యార్థిని దేశానికి ప్రాతినిధ్యం వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
*రూ.50 వేల ఆర్థిక సహాయం*
చైనాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఈశ్వరి కుటుంబ సభ్యులు వివరించారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలంతా కలిసి ఈశ్వరికి ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమని హరీశ్ రావు అన్నారు. ఈశ్వరి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు తన వంతు సహాయంగా రూ.50 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు సమాజం ముందుకు రావడం అవసరమని పేర్కొన్నారు.
*జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి*
ఈశ్వరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి మూడు సార్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై, వివిధ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. తన క్రీడా ప్రతిభను మరింత మెరుగు పరుచుకుంటూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరఫున పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదగడం పట్ల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో జరిగే పోటీల్లో ఈశ్వరి అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని, సిద్ధిపేటతో పాటు తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి మంచి పేరు తీసుకు రావాలని హరీశ్ రావు ఆకాంక్షించారు. పోటీల్లో రాణించాలని కోరుతూ “ఆల్ ది బెస్ట్” చెబుతూ ఈశ్వరికి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట మున్సిపల్ కౌన్సిలర్ ఎట్లా అరవింద్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాదాసి రమేశ్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ దర్శనాల రాజ్ కుమార్, ఉపాధ్యాయుడు నోముల లింగం, గట్లమల్యాల సర్పంచి ఇంగే నరేశ్ తదితరులు పాల్గొన్నారు

