నంగునూరు, సెప్టెంబర్ 26 (ప్రజావాణి): సిద్దిపేట
జిల్లా నంగునూరు మండలం నర్మెటలోని ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలోని వివిధ విభాగాలను పరిశీలించి, ఆయిల్‌ఫామ్ రైతులతో మాట్లాడి పంట సాగు, దిగుబడి, ఆదాయం, మార్కెటింగ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలో నీటి కొరత లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
మూడు ఎకరాల్లో రూ.4.13 లక్షల ఆదాయం
ఆయిల్‌ఫామ్ సాగు చేస్తున్న రైతులతో మంత్రి మాట్లాడిన సందర్భంగా ఓ రైతు తన అనుభవాలను వివరించారు. మూడు ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ తోట సాగు చేస్తున్నామని, ఇప్పటివరకు 11 సార్లు గెలల కోత చేపట్టడం ద్వారా రూ.4.13 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఫ్యాక్టరీకి పంటను తరలించిన రెండు, మూడు రోజుల్లోనే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయని చెప్పారు. ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్‌ఫామ్‌లో కోతుల బెడదతో పాటు ఇతర సమస్యలు తక్కువగా ఉంటాయని, తోటలో అంతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉండటంతో అధిక ఆదాయం పొందుతున్నామని వివరించారు.
మరో రైతు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో చెరువులు, చెక్‌డ్యామ్‌లలో నీరు లేక భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, బోరుబావులు ఎండిపోతున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రంగనాయక సాగర్ ద్వారా నీటిని అందించాలని కోరారు.
ఫ్యాక్టరీకి నీటి కొరత లేకుండా చర్యలు
జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా ఫామ్ పాండ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఫ్యాక్టరీ అవసరాలకు శాశ్వత చెరువు ఏర్పాటు చేసి వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు. ఫ్యాక్టరీలో వినియోగించే నీటిని రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగిస్తున్నామని, పరిసర రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
70 వేల మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యం
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తాను చేసిన మొదటి సంతకం నర్మెట ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీకి సంబంధించినదేనని తుమ్మల తెలిపారు. తెలంగాణకు మధ్యభాగంలో ఉన్న నర్మెట ఫ్యాక్టరీ భవిష్యత్తులో రాష్ట్రంలోని అనేక జిల్లాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి పంటను తరలించడంలో ఆలస్యం జరిగితే ఆయిల్ శాతం తగ్గి రైతులకు ధర తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు.
అందుకే రైతుల పంటను వీలైనంత త్వరగా ఫ్యాక్టరీకి తరలించి ప్రాసెస్ చేయాలనే ఉద్దేశంతో నర్మెటలో భారీ సామర్థ్యంతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఫ్యాక్టరీ సుమారు 70 వేల మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో పనిచేస్తోందని చెప్పారు. గంటకు 150 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక యంత్రాలతో దీనిని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
రైతుకు గిట్టుబాటు ధరే లక్ష్యం
ఆయిల్‌ఫామ్ గెలల్లో ఆయిల్ శాతం ఎక్కువగా వచ్చేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని మంత్రి తెలిపారు. కొత్తగా ఏర్పాటైన తోటలు, లేత తోటల ద్వారా రైతులు కష్టపడి ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారని చెప్పారు. రైతుకు చెల్లించే ధర ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా చూడాలని, పోటీ ద్వారా ఆయిల్ శాతం ఎక్కువగా వచ్చేలా ఫ్యాక్టరీలు పనిచేయాలని అన్నారు.
రాష్ట్రంలో ఆయిల్‌ఫామ్ సాగును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 3.20 లక్షల ఎకరాలకు పైగా ఆయిల్‌ఫామ్ సాగు ఉందని, ఈ ఏడాది మరో 5 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో 10 లక్షల ఎకరాల ఆయిల్‌ఫామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
రాష్ట్రంలో 14 ఫ్యాక్టరీలు నిర్మాణంలో
రాష్ట్రంలో ఆయిల్‌ఫామ్ సాగు విస్తరణకు అనుగుణంగా 14 ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల వరకు ఆయిల్‌ఫామ్ సాగు, హార్వెస్టింగ్ ఏర్పడితే అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి, ములుగు, వనపర్తి తదితర జిల్లాల్లో కూడా ఆయిల్‌ఫామ్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు కూడా రాష్ట్రంలో రిఫైనరీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఆయిల్‌ఫెడ్, ప్రైవేట్ కంపెనీల మధ్య పోటీ ఏర్పడితే రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
దిగుమతి సుంకం తగ్గింపుపై కేంద్రానికి లేఖ
విదేశాల నుంచి తినే నూనెల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల దేశీయ ఆయిల్‌ఫామ్ రైతులు నష్టపోతున్నారని మంత్రి తుమ్మల అన్నారు. గతంలో దిగుమతి సుంకం 44 శాతం వరకు ఉండగా, ఎన్నికల సమయంలో దానిని భారీగా తగ్గించడం వల్ల దేశీయ రైతుల ఉత్పత్తులకు ధరలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.
దిగుమతి సుంకాన్ని మళ్లీ పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర వ్యవసాయ, వాణిజ్య, ఆర్థిక, ఆహార శాఖల మంత్రులకు లేఖలు రాసినట్లు తెలిపారు. కేంద్రంలోని ప్రజాప్రతినిధులను కూడా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.
దేశంలో సుమారు 15 లక్షల ఎకరాల ఆయిల్‌ఫామ్ సాగు ఉంటే, అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే దాదాపు 10 లక్షల ఎకరాల సాగు ఉందని మంత్రి వివరించారు. తెలంగాణలో గత మూడు సంవత్సరాలుగా ఆయిల్‌ఫామ్ సాగు వేగంగా విస్తరిస్తోందన్నారు.
టన్నుకు రూ.25 వేల కనీస ధర ఇవ్వాలి
ఆయిల్‌ఫామ్ గెలల ధర టన్నుకు రూ.25 వేల కంటే తగ్గకుండా కనీస గ్యారెంటీ ధర కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు తుమ్మల తెలిపారు. ఇతర పంటలకు కనీస మద్దతు ధర ఉన్న విధంగానే ఆయిల్‌ఫామ్ రైతులకు కూడా ధరకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎరువులు, పురుగుమందులు, సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు వచ్చే ఆదాయం తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. గెలల ధరలు తగ్గకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని చెప్పారు.
ఆయిల్ రిఫైనరీ, ప్యాకింగ్ సౌకర్యాలు
నర్మెట ఫ్యాక్టరీలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అక్కడే సుమారు 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. క్రూడ్ ఆయిల్‌ను తెలంగాణలోనే రిఫైనరీ చేసే విధానాన్ని అభివృద్ధి చేసి, ప్యాకింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.
దీంతో ఆయిల్‌ఫామ్ పంటకు కేవలం ఫ్యాక్టరీ స్థాయిలోనే కాకుండా రిఫైనింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ వరకు విలువను పెంచి రైతులకు మరింత ప్రయోజనం కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు.
తెలంగాణను ఆయిల్‌ఫామ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
తెలంగాణను దేశంలోనే ప్రధాన ఆయిల్‌ఫామ్ హబ్‌గా మార్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. గత ఏడాది ఆయిల్‌ఫామ్ సాగు విస్తరణలో తెలంగాణ 36 శాతం వృద్ధితో ముందంజలో ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో 10 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల వరకు ఆయిల్‌ఫామ్ సాగును విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ భూములు ఆయిల్‌ఫామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని, రైతులు తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆదాయం పొందే పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. రాబోయే రబీ సీజన్‌కు అనుగుణంగా పంటల ప్రణాళికను త్వరలో ప్రకటించి రైతులకు అవసరమైన విత్తనాలు, మార్కెటింగ్, ఎగుమతి సౌకర్యాలను ప్రభుత్వం తరఫున కల్పిస్తామని తెలిపారు.
ఫ్యాక్టరీ భవిష్యత్తులో తెలంగాణకు మణిహారం
నర్మెట ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ భవిష్యత్తులో తెలంగాణకు మణిహారంగా నిలుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో పంట పండినా త్వరగా ఫ్యాక్టరీకి తరలించి ప్రాసెస్ చేసేలా నర్మెటకు భౌగోళికంగా అనుకూలత ఉందన్నారు. రైతులు అధికంగా ఆయిల్‌ఫామ్ సాగు చేసి దేశానికి అవసరమైన వంట నూనెల ఉత్పత్తిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి పలువురు ఉన్నతాధికారులు నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్, రైతులు,పలువురు నాయకులు పాల్గొన్నారు


జిల్లా నంగునూరు మండలం నర్మెటలోని ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలోని వివిధ విభాగాలను పరిశీలించి, ఆయిల్‌ఫామ్ రైతులతో మాట్లాడి పంట సాగు, దిగుబడి, ఆదాయం, మార్కెటింగ్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలో నీటి కొరత లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
