📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి

జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

*జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి – మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే పల్లా వినతి*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి):
జనగామ జిల్లాలో రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా జనగామ మున్సిపల్ కార్యాలయంలో రూ.1.77 కోట్ల విలువైన 16 నూతన చెత్త సేకరణ ఆటోలు, జేసీబీని ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో 54 మంది శానిటరీ వర్కర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లకు నియామక పత్రాలను అందజేశారు.

అనంతరం మున్సిపల్ డంపింగ్ యార్డ్ షెడ్, మెషినరీ, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. అలాగే జనగామ మున్సిపాలిటీ పరిధిలో 99 మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. 500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జనగామ మున్సిపాలిటీ, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి పెండింగ్ పనులను పూర్తి చేయాలని, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు తదితర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇందిరానగర్ తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని మూడు వార్డులకు మంజూరైన రూ.25 కోట్ల నిధులు, ఎన్నికల సమయంలో మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన రూ.18.9 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. గత మూడేళ్లుగా మున్సిపాలిటీ నిధుల కొరతను ఎదుర్కొంటోందని, అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు అవసరమని, కలెక్టర్, డీఎంఎఫ్టీ నిధులతో ప్రస్తుతం జరుగుతున్న పనులకు అదనంగా మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.

వడ్లకొండ పరిధిలోని షామీర్ పేట వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున సుమారు కిలోమీటర్ మేర అప్రోచ్ రోడ్డు నిర్మించాలని, దానికి ఆర్ అండ్ బీ లేదా సంబంధిత శాఖ ద్వారా వెంటనే నిధులు మంజూరు చేయాలని అన్నారు.

చిటకోడూరు మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు గండిరామారం ప్రాంతంలో నెలకొన్న వరద నీటి సమస్యను పరిష్కరించాలని, గండిరామారంలోని నాలుగు పంపుల్లో వరద నీటిలో మునిగిన రెండు పంపులను వెంటనే మరమ్మతు చేసి ప్రజలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.

ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను రాజకీయాలకు అతీతంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, మొదటి విడతలో మిగిలిన ఇందిరమ్మ ఇళ్లతో పాటు రెండో విడతలో కేటాయించిన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి, అవసరమైన మేరకు అదనపు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.