*గుడిబండ తండాలో ఝాన్సీ రెడ్డి పూజలు*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి):
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని గుడిబండ తండా గ్రామంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ శ్రీ అభిరామ్ నాయక్ ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన ఆమెకు గ్రామ పెద్దలు, యువత, మహిళలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు డప్పు వాయిద్యాలతో, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని సందర్శించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించాలని, పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని గణనాథుడిని వేడుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కేవలం మతపరమైన వేడుకలు మాత్రమే కాదని, అవి భక్తి, ఐకమత్యం, సామాజిక సేవకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో ఇంత భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో వినాయక ఉత్సవాలను నిర్వహించడం చాలా గొప్ప విషయమని, ఇలాంటి ఉత్సవాలు గ్రామాల్లో సోదరభావాన్ని, జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. యువత ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయమన్నారు.

స్థానిక సర్పంచ్ అభిరామ్ నాయక్ మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి గ్రామానికి విచ్చేసి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి గ్రామస్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, యువత మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

