జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి సెప్టెంబర్ 17(ప్రజావాణి):
ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు. గురువారం రోజున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లో కేటీఆర్ ను కలిశారు. గుల్లకోట గ్రామానికి చెందిన సింహాచలం జగన్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, ఆయన కుటుంబ స్థితిగతులను కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి, బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్, జగన్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఎలాంటి కష్టాలొచ్చినా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ధైర్యాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కావని హితావు పలికారు. పార్టీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు మండల నాయకులు ఏలేటి కృష్ణారెడ్డి, గాజుల మల్లేశం, మారం జలందర్ రెడ్డి, కల్వల గంగాధర్ రావు, ముత్యం బలరాంరెడ్డి, రాంచందర్ గౌడ్, మాధవరావు, సందీప్, కల్వల తేజ, దూస గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
