చట్టబద్ధ ప్రయోజనాలు కల్పించాల్సిందే
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ స్పష్టం
జైపూర్, సెప్టెంబర్ 15, ప్రజావాణి:
సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎస్‌టీపీపీ)లోని కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) సమక్షంలో మంగళవారం కన్సిలియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి హెచ్‌ఎంఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్‌తో పాటు ఎస్‌టీపీపీ హెచ్‌ఎంఎస్ నాయకులు విక్రమ్, ప్రదీప్, సాయికృష్ణ మరియు వివిధ విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు హాజరయ్యారు. సింగరేణి యాజమాన్యం తరఫున డీజీఎం (పర్సనల్) రాజేశ్వరరావు పాల్గొన్నారు.సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాల్సిన లీవ్ వేజెస్, యాన్యువల్ లీవ్స్, పండుగ సెలవులు (పీహెచ్) మరియు మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు (మాతా శిశు సంక్షేమ లబ్ధి) అందించడంపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు గడచిన నాలుగు నెలలుగా వేతనాలు నిలిచిపోవడంతో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను హెచ్‌ఎంఎస్ ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్.. నిర్దేశిత గడువులోగా కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఒకవేళ కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడంలో విఫలమైతే, చట్ట నిబంధనల ప్రకారం ‘ప్రిన్సిపల్ ఎంప్లాయర్’గా సింగరేణి యాజమాన్యమే ఆ బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. చట్ట ప్రకారం కార్మికులకు అందాల్సిన అన్ని రకాల చట్టబద్ధ ప్రయోజనాలను (స్టాట్యుటరీ బెనిఫిట్స్) తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.
ఈ నెల 29న ఎస్‌టీపీపీలో రికార్డుల తనిఖీ
కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్న కార్మికులకు అందుతున్న ప్రయోజనాలకు సంబంధించిన అన్ని రకాల రిజిస్టర్లు, రికార్డులను సిద్ధంగా ఉంచాలని యాజమాన్యాన్ని కమిషనర్ ఆదేశించారు. ఈ నెల 29న తానే స్వయంగా ఎస్‌టీపీపీని సందర్శించి ఆయా రికార్డులను పరిశీలిస్తానని వెల్లడించారు. అనంతరం అదే రోజు ఉదయం 11:30 గంటలకు మరోసారి కన్సిలియేషన్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కార్మికుల హక్కుల అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారమయ్యే వరకు హెచ్‌ఎంఎస్ యూనియన్ తరఫున పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు.

