ఘట్కేసర్, ఆగస్టు 3: దేశ యువత ఆశయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీలో జాప్యం, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనీకరణ, విద్యా రంగంలోని సమస్యలు యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. సోమవారం అన్నోజీగూడలో నిర్వహించిన ఏఐవైఎఫ్ ఘట్కేసర్ మండల 3వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మండల కార్యదర్శి సంపంగి సదాశివ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువతలో ఉపాధి, పరీక్షల పారదర్శకత, భవిష్యత్ అవకాశాలపై అసంతృప్తి పెరుగుతోందన్నారు. యువ నిరుద్యోగం ఆందోళనకర స్థాయిలో ఉందని, పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఘట్కేసర్ మండలంలో స్థానిక ఉపాధి అవకాశాల కొరత, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల లేమి, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల సమస్యలు, యువతకు క్రీడా, సాంస్కృతిక వేదికల కొరత తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేయాలని, స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించి యువతకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సల్మాన్ బేగ్, జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు యువత సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందించే కీలక వేదికగా నిలుస్తాయని తెలిపారు. ఉద్యోగ హక్కు, విద్య, వైద్యం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై తీర్మానాలు చేసి భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. యువత, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ మహాసభలో సీపీఐ ఘట్కేసర్ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, ఏఐవైఎఫ్ మండల కార్యవర్గ సభ్యులు సతీష్, యాదగిరి, ఆంజనేయులు, శ్రీను, సాయి పాస్వాన్, శివ, భరత్, మధు, అనీల్, ప్రదీప్, రెహ్మాన్, జాన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.


