వెనుకబడిన సూచికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
* సమన్వయంతో పనిచేసి బద్వేల్ నియోజకవర్గానికి ‘A’ గ్రేడ్ సాధించడమే లక్ష్యం
* సమావేశంలో పాల్గొన్న డివిజనల్, మండల స్థాయి అధికారులు
బద్వేల్, ఆగస్టు 3 ప్రజావాణి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందంజలో నిలిపి ‘A’ గ్రేడ్ సాధించాలని బద్వేల్ డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ & కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఎ. చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు.సోమవారం సాయంత్రం బద్వేల్ ఆర్డీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో జూన్–2026 నెలకు సంబంధించిన బద్వేల్ నియోజకవర్గ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్ (పనితీరు సమీక్షా సమావేశం) ఆర్డీవో శ్రీ ఎ. చంద్రమోహన్ అధ్యక్షతన అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది.ఈ సమీక్షా సమావేశంలో ప్రతి ప్రభుత్వ శాఖకు కేటాయించిన కేపీ లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, శాఖల వారీగా కనబరిచిన పనితీరు, ఇంకా పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై డివిజనల్ మరియు మండల స్థాయి అధికారులతో ఆర్డీవో లోతుగా చర్చించారు. కొన్ని రంగాలలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఆయన, తక్కువ పనితీరు నమోదైన విభాగాలలో తక్షణమే ప్రగతిని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేయాలి:ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీ ఎ.చంద్రమోహన్ మాట్లాడుతూ,నియోజకవర్గ ప్రగతిని నిర్దేశించే కేపీలలో వెనుకబడిన సూచికలను ప్రతి శాఖా అధికారి ప్రత్యేకంగా గుర్తించాలని సూచించారు.వాటిలో త్వరితగతిన పురోగతి సాధించేందుకు వీలుగా ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే కాకుండా,వాటికి సంబంధించిన తాజా సమాచారాన్ని, వివరాలను సకాలంలో కేపీ ల పోర్టల్‌లో నవీకరించాలని ఆదేశించారు. శాఖల మధ్య అంతర్గత సమన్వయం పెరగాలని,ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.సమావేశంలో పాల్గొన్న అధికారులు:ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో బద్వేల్ డివిజన్ ఎల్.డి.ఓ శ్రీ వెంకట శేషయ్య తో పాటు నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ,ఉద్యానవన, పశుసంవర్ధక,వైద్య & ఆరోగ్య, పోలీస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్,గ్రామీణ నీటి సరఫరా,హౌసింగ్, మున్సిపాలిటీ, ఐసిడిఎస్ తదితర ప్రభుత్వ అనుబంధ శాఖలకు చెందిన డివిజనల్ మరియు మండల స్థాయి అధికారులు, తహశీల్దార్లు,ఎంపీడీవోలు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.


