పోచారం, జూన్ 30: అన్నోజిగూడలోని జడ్పీహెచ్‌ఎస్ (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల)ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతులు, విద్యా పరిస్థితులను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు.
పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ 6వ, 7వ, 8వ, 9వ తరగతుల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న తరగతి గదులు సరిపోవడం లేదని, ఒకే గదిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండడం వల్ల బోధన నిర్వహించడం కష్టంగా మారుతోందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అదనపు తరగతి గదుల నిర్మాణానికి సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, పాఠశాల అవసరాలను గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణంపై సంబంధిత అధికారులతో చర్చించి సానుకూల చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ టి ప్రతాప్ రెడ్డి. రాందాస్, పిటి టీచర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.





