ఘట్కేసర్, జూన్ 29: వివాహం నిశ్చయమైన ఓ యువతి అనుమానాస్పదంగా అదృశ్యమైన ఘటన పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, సిరిసిల్ల జిల్లా పెద్ద బోనాల గ్రామానికి చెందిన భానోతు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే అదృశ్యమైన భానోతు వసంత (23) బోడుప్పల్‌లోని అభయ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ, తన సోదరి స్వప్నతో కలిసి ఘట్కేసర్ మండలం చౌదరిగూడ స్వర్ణగిరి కాలనీలో నివాసముంటోంది. ఇటీవల ఆమె వివాహం నిశ్చయమైన నేపథ్యంలో ఈ నెల 21న స్వగ్రామానికి వెళ్లింది. అనంతరం ఉద్యోగానికి సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉందని చెప్పి ఈ నెల 23న చౌదరిగూడకు చేరుకుంది.
24వ తేదీన తండ్రితో ఫోన్లో మాట్లాడిన వసంత, ఇంకా సర్టిఫికెట్లు తీసుకోలేదని, 26న స్వగ్రామానికి వస్తానని తెలిపింది. ఆ తర్వాత ఆమె మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇంటి యజమాని, ఉద్యోగం చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యాన్ని సంప్రదించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి వసంత విధులకు కూడా హాజరు కావడం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపారు. తన కుమార్తె అదృశ్యంపై అల్లుడు కల్యాణ్‌పై అనుమానం ఉందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఈ మేరకు పోచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




