
•ఓటరు జాబితా సవరణలో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సింధు ఆదర్శ్ రెడ్డి
*ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి
పటాన్‌చెరు, జూన్ 20 (ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని భారతి నగర్ డివిజన్ హెచ్ఐజి కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు బూత్ స్థాయి ప్రతినిధులకు ఓటరు జాబితా పరిశీలన, ఓటర్ల వివరాల ధృవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, అర్హత లేని పేర్ల తొలగింపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అర్హులైన ఓటర్ల పేర్లు కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే ఒకే వ్యక్తికి సంబంధించిన ద్వంద్వ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లను ఎన్నికల నిబంధనల ప్రకారం తొలగించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా వెన్నెముక వంటిదని, అది పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ సర్కిల్ మాజీ అధ్యక్షుడు పరమేష్ యాదవ్, బూత్ స్థాయి ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



