కలసపాడు మండలం తెల్లపాడు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో నెలకొన్న తీవ్ర వీధి దీపాల సమస్య
* మూడు రోజులుగా అంధకారంలోనే కాలనీ
* పాములు, తేళ్లతో భయం భయంగా గడుపుతున్న ప్రజలు
* పట్టించుకోని లైన్‌మెన్.
కలసపాడు జూన్ 5 ప్రజావాణి తెల్లపాడు గ్రామపంచాయతీలోని ఎస్సీ కాలనీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. గత మూడు రోజులుగా కాలనీ మొత్తం చీకటిమయంగా మారినప్పటికీ, అధికారులు గానీ, విద్యుత్ శాఖ సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదని స్థానిక దళిత వృద్ధులు, మహిళలు, యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు వెలగడం లేదని, కొత్త లైట్లు అమర్చాలని అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివక్ష చూపిస్తున్నారా? గ్రామస్తుల స్థానిక లైన్‌మెన్‌ను ఈ విషయమై నిలదీయగా.”లైట్లను ప్రొద్దుటూరు నుంచి తెచ్చారు, వాళ్లే బిగించారు,వాళ్లనే అడగండి” అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇతర కాలనీలకు ఇచ్చే ప్రాధాన్యత ఎస్సీ కాలనీకి ఎందుకు ఇవ్వడం లేదని,తాము చీకట్లోనే బతకాలా అని వారు ప్రశ్నిస్తున్నారు.అధికారుల అంత నిర్లక్ష్యానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదని వాపోతున్నారు.కొండచిలువలు,విషసర్పాల భయం గతంలో ఇదే ఎస్సీ కాలనీలోకి పెద్ద కొండచిలువలు వచ్చిన సంఘటనలు ఉన్నాయని, దానికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో పాములు, తేళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చిన్న పిల్లలు, వృద్ధులు రాత్రి పూట బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.ఈ తీవ్రమైన సమస్యపై జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి, విచారణ జరిపించాలని తెల్లపాడు ఎస్సీ కాలనీ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుని, వెంటనే వీధి దీపాలు వేయించి తమకు అంధకారం నుండి విముక్తి ప్రసాదించాలని, కాలనీ వాసుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.




