జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, మే 14 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని విడుదల చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గజంగి నందయ్యతో సంప్రదింపులు జరిపిన అనంతరం, నియోజకవర్గంలోని సమర్థులైన నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ధర్మపురి మండలం కు గాను చిలుముల లక్ష్మణ్, బుగ్గారం మండలం నగ్నూరి నర్సగౌడ్, ఎండపల్లి మండలం గెల్లు శేఖర్ యాదవ్, గొల్లపల్లి మండలం రాపెల్లి గంగమ్మ, పెగడపల్లి మండలం కడారి తిరుపతి లను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కృషి చేయాలని అధిష్టానం సూచించింది. తమ నియామకానికి సహకరించిన జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి నూతన అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.



