జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రహదారి విస్తరణ పనులు, ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు.
శనివారం, జిల్లాలోని లింగాల ఘనపురం మండలం, నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రహదారి విస్తరణ పనులను డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు.
ఈ సందర్భంగా నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రహదారిపై ఏర్పడుతున్న బాటిల్ నెక్ సమస్యను పరిష్కరించేలా రహదారి విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. బ్రిడ్జి వద్ద కల్వర్టును విస్తరించడంతో పాటు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారిని సమగ్రంగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
రహదారి వెడల్పు, వాహనాల వేగం, రహదారి వంపులు, ఎత్తుపల్లాలు, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
ఐఆర్సీ (ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్) మార్గదర్శకాల ప్రకారం, బ్రిడ్జి అప్రోచ్ ప్రాంతం నుంచి యూటర్న్ ఏర్పాటు చేసే ప్రదేశానికి తగిన దూరం ఉండేలా పరిశీలించి, వాహనదారులకు సురక్షితంగా యూటర్న్ తీసుకునే అవకాశం కల్పించాలని సూచించారు.
రహదారిపై వాహనాలు వేగంగా వచ్చే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా రహదారి నిర్మాణ పనులను చేపట్టాలన్నారు.
రహదారికి ఇరువైపులా ఖాళీగా ఉన్న స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ పాదచారుల సౌకర్యార్థం ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టాలని, అవసరమైన చోట పేవర్ బ్లాక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. పాదచారులు సురక్షితంగా నడిచేందుకు వీలుగా రెండు వైపులా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఫుట్‌పాత్ ప్రాంతాల్లో బెంచీలు ఏర్పాటు చేయాలని, వాకింగ్‌కు వచ్చే ప్రజలకు ఉపయోగపడేలా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు.
రహదారి వంపులు, ప్రమాదకర నిర్మాణాలు, ఎత్తైన ర్యాంప్‌ల వంటి ప్రాంతాలను పరిశీలించి, వాహనదారులకు ప్రమాదం కలగకుండా అవసరమైన మార్పులు చేపట్టాలని తెలిపారు. రహదారికి ఇరువైపులా రక్షణ గోడలు, ఐరన్ గ్రిల్స్, క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో నేషనల్ హైవేస్ ఈఈ నిరంజని, డీఈఈ రాజారాం, డీపీఓ వెంకట్ రెడ్డి, సర్పంచ్ నర్సింగ రామకృష్ణ, ఇతర సంబంధిత అధికారులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
o

