జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): కొమురవెల్లి మండల రైతు వేదికలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు నేస్తం’ ఎపిసోడ్–114 ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న కరవు పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల వైవిధ్యీకరణ, ఆరుతడి పంటల సాగు, భూగర్భ జలాల సంరక్షణ, పంట రుణాల రీషెడ్యూలింగ్పై రైతులకు అవగాహన కల్పించారు.
అర్హులైన రైతులు పంట రుణాల రీషెడ్యూలింగ్ కోసం సంబంధిత బ్యాంకుల్లో సమ్మతి పత్రాలు అందజేయాలని, ఈ ప్రక్రియను డిసెంబర్ 7వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని సూచించారు.
రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేస్తూ, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటించి పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని అధికారులు తెలిపారు.
రైతులకు అండగా నిలుస్తూ, కరవు పరిస్థితుల్లో వ్యవసాయాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏవో వెంకట రామమ్మ గారు, ఏఈఓ రవళి, ఏఈఓ భాస్కర్ రెడ్డి, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

