జనగామ జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, బహుజన అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.
డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు జాయ మల్లేష్, డీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ నరేందర్ పవార్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సమాజంలో పాతుకుపోయిన కుల వివక్ష, సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలపై మహాత్మా జ్యోతిబా పూలే సాగించిన పోరాటం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్య ద్వారానే అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం, సమాన అవకాశాలు లభిస్తాయని నమ్మి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన నిరంతరం కృషి చేశారని కొనియాడారు.
మహాత్మా పూలే ఆశయాలను నేటి తరాలు ఆదర్శంగా తీసుకొని, కులమతాలకు అతీతంగా ఐక్యతతో ముందుకు సాగాలని, విద్యా అవకాశాలను ప్రతి ఒక్కరికీ అందించి సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, బహుజన అభివృద్ధి, అణగారిన వర్గాల ఆత్మగౌరవమే పూలేకు మనం అందించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఈసీ మెంబర్ భూక్యా కోట నాయక్, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా జాయింట్ సెక్రటరీ బాలు జాదవ్, కాంగ్రెస్ జనగామ పట్టణ అధ్యక్షులు కవిడే శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఉపాధ్యక్షులు రాపోతుల ఉప్పలయ్య, పాలకుర్తి నియోజకవర్గ సేవాదళ్ బ్లాక్ అధ్యక్షులు బానోత్ రాంచందర్, కేమిడి ఉపేందర్, నల్లకుంట సర్పంచ్ బానోత్ మహేందర్, దేవరుప్పుల కాంగ్రెస్ యువ నాయకులు మూఢ సోమన్న, కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లకావత్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

