**రైతులకు కీలక సూచనలు.. డిసెంబర్ 7లోపు పంట రుణాల రీషెడ్యూల్.. వరికి బదులుగా పప్పు పంటలు సాగు చేయండి!**
వేలేరు మండల వ్యవసాయ శాఖ నుంచి రైతులకు కీలక సూచనలు..
2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు డిసెంబర్ 7వ తేదీలోపు సంబంధిత బ్యాంకులను సంప్రదించి రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని వేలేరు మండల వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
అర్హులైన రైతులు బ్యాంకులో అవసరమైన ఫారం సమర్పించాలని తెలిపారు. రుణ నిబంధనల ప్రకారం రీషెడ్యూల్ చేసుకోవడం ద్వారా ఏడాది వరకు వడ్డీ చెల్లింపు నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ సదుపాయం పేర్కొన్న ఆరు నెలల కాలంలో పంట రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే పప్పుదినుసుల పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
ప్రస్తుతం నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు తగ్గి, విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో నీటి కొరతతో పంటలు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటి అవసరమయ్యే పంటలను ఎంపిక చేసుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని వేలేరు మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేశారు.

