*ఆరుట్ల శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామి సేవలో మల్‌రెడ్డి స్నేహ-అభిషేక్*
*స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్న దంపతులు*
*రామలింగేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్ష*
*ఆలయ ప్రాంగణంలోని సంత్ శ్రీ నరసింహ మహారాజ్ గారి సమాధి సందర్శన*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 28 (ప్రజావాణి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆరుట్ల శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి వారిని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి, మల్‌రెడ్డి యువశక్తి కన్వీనర్ మల్‌రెడ్డి స్నేహ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన దంపతులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు పలికారు. బుగ్గరామలింగేశ్వరస్వామి వారి కరుణాకటాక్షాలతో ప్రజలంతా పాడిపంటలతో, ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్థిల్లాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఆలయ గుట్టపై ఉన్న సంత్ శ్రీ నరసింహ మహారాజ్ గారి సమాధిని సందర్శించి, నమస్కరించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

