*ప్రతిష్ఠాత్మక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం అందుకున్న ఆచార్య సూర్యా ధనంజయ్*
*‘ఝోళి’ (గోర్ బంజారా సాకి) కథా సంపుటికి 2025 సంవత్సరపు సాహితీ పురస్కారం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని భల్లూనాయక్ తండాకు చెందిన ఆచార్య సూర్యా ధనంజయ్ ప్రతిష్ఠాత్మక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. 2025 సంవత్సరానికి గాను ఆమె రచించిన ‘ఝోళి’ (గోర్ బంజారా సాకి) కథా సంపుటికి ఈ పురస్కారం లభించింది. ప్రస్తుతం ఆమె వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘ఝోళి’ కథా సంపుటిలోని పన్నెండు కథలు బంజారా సమాజపు జీవితాలకు, వారి వ్యథలకు అద్దం పడతాయి. అభివృద్ధికి దూరంగా, అటవీ ప్రాంతాల్లో ఆవాసమున్న బంజారా ప్రజల చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక పరిమళం, జీవన వైవిధ్యం, సామాజిక సమస్యలు, అంతరంగ సంఘర్షణలను ఈ కథలు హృద్యంగా ఆవిష్కరిస్తాయి. బంజారా సమాజపు అస్తిత్వాన్ని, జీవన అనుభవాలను సాహిత్య రూపంలో ప్రతిబింబించిన ఈ రచన విశేష గుర్తింపును పొందింది. అశేష సాహితీ అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, మైసూరు లోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య వై. రెడ్డి శ్యామల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. భల్లూనాయక్ తండా నుంచి ఉన్నత విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించి, బంజారా సాహిత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తున్న ఆచార్య సూర్యా ధనంజయ్‌కు ప్రతిష్ఠాత్మక సాహితీ పురస్కారం లభించడం పట్ల సాహితీవేత్తలు, విద్యావేత్తలు, బంజారా సాహితీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

