📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణ1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. ఆదివాసీ భూములను పరిరక్షించాలి

1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. ఆదివాసీ భూములను పరిరక్షించాలి

📰 Generate e-Paper Clip

1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. ఆదివాసీ భూములను పరిరక్షించాలి!

• డిసెంబర్ 7న వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయ ముట్టడికి ఆదివాసీ సంఘాల పిలుపు

• కాగితాలకే పరిమితమైన ఏజెన్సీ చట్టాలు.. అన్యాక్రాంతమవుతున్న గిరిజన భూములు

• అక్రమ బదలాయింపులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

• పీసా చట్టం, ఐదవ షెడ్యూల్ హక్కుల సాధనకు ఐక్య పోరాటం: ఆదివాసీ జేఏసీ

వెంకటాపురం (నూగురు), నవంబర్ 25 (మన ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసుల భూములు, రాజ్యాంగబద్ధమైన హక్కులు, వారి సంప్రదాయ జీవన విధానాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించిన 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీ సంఘాల (జాయింట్ యాక్షన్ కమిటీ) డిమాండ్ చేసింది. చట్టాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలంటూ 2026 డిసెంబర్ 7వ తేదీన వెంకటాపురం మండల తహసీల్దార్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆదివాసుల అస్తిత్వానికి ముప్పు:
‘జల్, జంగిల్, జమీన్’ (నీరు, అడవి, భూమి) అనే నినాదంతో ప్రకృతిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసుల భూములు ఏజెన్సీ ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ బదలాయింపులకు, ఆక్రమణలకు గురవుతున్నాయని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అక్రమార్కులు బినామీ పేర్లతో, నకిలీ పత్రాలతో గిరిజనుల భూములను కాజేస్తున్నా సంబంధిత రెవెన్యూ, ఏజెన్సీ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. చట్టాలు అమలుకాకపోతే భవిష్యత్తులో ఆదివాసులు తమ సొంత గడ్డపైనే పరాయివారిగా మారే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఆదివాసీ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే..
• 1/70 చట్టం అమలు: ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ భూ బదలాయింపు నియంత్రణ నిబంధనలు-1959 (1970 సవరణ) చట్టాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో తూచా తప్పకుండా అమలు చేయాలి.
• భూముల పునరుద్ధరణ: ఆదివాసుల భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను తక్షణమే అరికట్టి, అన్యాక్రాంతమైన భూములను గుర్తించి చట్టప్రకారం తిరిగి ఆదివాసులకే అప్పగించాలి.
• రీసర్వే, రక్షణ: ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ భూములకు సమగ్ర రీసర్వే నిర్వహించి, ఆక్రమణలకు గురికాకుండా కంచె వేసి రక్షణ కల్పించాలి.
• పీసా, పంచాయతీరాజ్ చట్టాలు: పీసా చట్టం (1996) ప్రకారం గ్రామసభలకు కల్పించిన సర్వాధికారాలను అమలు చేయడంతో పాటు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 (సెక్షన్ 260) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూముల అన్యాక్రాంతాన్ని నిరోధించాలి.
• అధికారులపై చర్యలు: అక్రమ భూ బదలాయింపులకు, ఆక్రమణలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించిన అధికారులపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
• ప్రత్యేక విచారణ, ఉపాధి: ఆదివాసీ భూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక రెవెన్యూ విచారణ చేపట్టాలి. భారత రాజ్యాంగం ఐదవ షెడ్యూల్ హక్కులను పరిరక్షిస్తూ, ఆదివాసీ యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి.
ఉద్యమంలో ఐక్యంగా కదలిరండి:
ఆదివాసుల భూమి ఆదివాసులకే చెందాలని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. మండల స్థాయిలో ప్రారంభమయ్యే ఈ ఉద్యమాన్ని అవసరమైతే జిల్లా, రాష్ట్ర స్థాయికి విస్తరిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 7న జరిగే వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయ ముట్టడికి ఆదివాసీ సంఘాల నాయకులు, యువజన, మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏ న్ స్) రాష్ట్ర అధ్యక్షులు కోర్స నరసింహమూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ఏ స్ పి) ములుగు జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్, గోండ్వానా సంక్షేమ పరిషత్ (జి స్ పి) ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్, ఏఎస్పీ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు, తుడుం దెబ్బ వెంకటాపురం మండల అధ్యక్షులు కణితి వెంకటకృష్ణ, ఏఎస్పీ మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు తదితరులతో పాటు ఆదివాసీ యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.