బాలలపై వేధింపులు, దోపిడీని అరికట్టేందుకు సమాజం సమష్టిగా కృషి చేయాలి
బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ఆపదలో 1098కు ఫోన్ చేయాలి
ప్రాతూరులో బాలబాలికలకు అవగాహన కార్యక్రమం
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 25 తాడేపల్లి
బాలబాలికలపై జరుగుతున్న దోపిడీ, హింస, వేధింపులను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అత్తోట పోతురాజు పిలుపునిచ్చారు. పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల బాధ్యత అని పేర్కొన్నారు.
తాడేపల్లి మండలం ప్రాతూరు గ్రామంలో బుధవారం గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాలబాలికలకు బాలల హక్కులు, రక్షణ, వేధింపుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తోట పోతురాజు మాట్లాడుతూ నేటి సమాజంలో చిన్నారులు అనేక రకాల దోపిడీ, హింస, వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే పరిస్థితి ఉండదని, అటువంటి సమయంలో పెద్దలు వారికి అండగా నిలిచి సరైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.బాలలపై జరిగే శారీరక, మానసిక, లైంగిక వేధింపులు, ఆర్థిక దోపిడీ, బాల కార్మికత్వం వంటి సమస్యలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా విశ్వసనీయమైన పెద్దలకు తెలియజేయాలని, అవసరమైన సహాయం పొందే విధానాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.బాలల రక్షణ కోసం ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని అన్నారు. కేవలం ఉన్నతస్థాయిలో విధానాలు రూపొందించడం మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వారికి తగిన కౌన్సెలింగ్, మానసిక ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల సమస్యలను వ్యక్తిగత అంశాలుగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించి అందరూ కలిసికట్టుగా పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.18 సంవత్సరాల లోపు పిల్లల శారీరక, మానసిక, లైంగిక శ్రేయస్సుకు హాని కలిగించే ఎలాంటి చర్యనైనా నిర్లక్ష్యం చేయకూడదని, బాలలపై వేధింపులు జరిగినట్లు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బాలల సహాయార్థం అందుబాటులో ఉన్న 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ గురించి వివరించారు. ఆపదలో ఉన్న పిల్లలు లేదా వారి పరిస్థితి గురించి తెలిసిన ఎవరైనా 1098కు సమాచారం అందించవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 112 ద్వారా పోలీసుల సహాయం పొందవచ్చని చెప్పారు. అలాగే బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (POCSO Act–2012) గురించి వివరించి, ఈ చట్టం బాలలకు కల్పించే రక్షణ, నేరాలకు సంబంధించిన శిక్షలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ బాలల పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.

